25 ఏళ్ల నాటి లంచం కేసులో 80 ఏళ్ల రిటైర్డ్ ఎంపీడీవోకు రెండు శిక్షలు.. ఏకకాలంలో అనుభవించాలన్న ఏపీ హైకోర్టు

  • ఏపీఏటీ ట్రైబ్యునల్ ఆదేశాలను అమలు చేసేందుకు రూ. 5 వేలు లంచం అడిగిన అప్పటి ఎంపీడీవో
  • లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
  • 2005లో ఎంపీడీవోను నిర్దోషిగా ప్రకటించిన ఏసీబీ కోర్టు
  • ఏసీబీ తీర్పును కొట్టేసిన ఏపీ హైకోర్టు
  • వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం
25 ఏళ్లనాటి లంచం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న 80 ఏళ్ల రిటైర్డ్ ఎంపీడీవోకు సెక్షన్-7, సెక్షన్ 13(1) కింద రెండు శిక్షలు విధించింది. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని ఆదేశాల్లో పేర్కొంది. 

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి, నడిమి తిరువూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా తనకు బాధ్యతలు అప్పగించేలా ఆదేశాలివ్వాలని, వేతన బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రధానోపాధ్యాయుడు శేషారావు 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అప్పటి ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావును కోరారు. 

అలాగే చేస్తానని, కాకపోతే 5 వేల రూపాయల లంచం ఇచ్చుకుంటేనే పని అవుతుందని ఎంపీడీవో తేల్చి చెప్పారు. దీంతో శేషారావు 1998లో అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. ఈ క్రమంలో అదే ఏడాది ఏప్రిల్‌లో ఎంపీడీవో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసును విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు ఎంపీడీవోను నిర్దోషిగా  ప్రకటిస్తూ మే 2005లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీబీ 2007లో హైకోర్టుకెక్కింది. అప్పటికి ఎంపీడీవో వయసు 64 సంవత్సరాలు. 

తాజాగా కేసును విచారించిన హైకోర్టు.. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాధారాలను ఏసీబీ కోర్టు సరిగా పరిశీలించలేదని వ్యాఖ్యానించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్-7 కింద ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1) కింద ఏడాది కఠిన కారాగార శిక్ష,రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.  

అంతేకాదు, రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా, రిటైర్డ్ ఎంపీడీవో వెంకటేశ్వరరావు వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్నారని, శిక్ష విషయంలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలన్న ఆయన తరపు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.


More Telugu News