పుతిన్ ప్రసంగాన్ని.. చెవులకు నూడుల్స్ తగిలించుకుని విన్న ఎంపీ.. ఎందుకు?

  • చెవులకు నూడుల్స్ తో ఓ ఇంగ్లిష్ జాతీయాన్ని గుర్తు చేసిన చట్టసభ్యుడు మిఖియల్ అబ్డాల్కిన్
  • ‘హ్యాంగ్ నూడుల్స్ ఆన్ ఇయర్స్’ అంటే.. వ్యక్తిని మోసం చేయడమని అర్థం
  • ‘నన్ను మోసం చేయకు.. నాతో అబద్ధం చెప్పకు’ అని పరోక్షంగా పుతిన్ కు చురక
  • ఆయన్ను శిక్షిస్తామని ప్రకటించిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగి ఏడాది అవుతున్న సందర్భంగా మూడు రోజుల కిందట ప్రజలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణమని ఆరోపించారు. అయితే ఆయన ప్రసంగాన్ని ఆన్ లైన్ లో వింటూ ఓ చట్టసభ్యుడు చేసిన పని వైరల్ అవుతోంది. 

మిఖియల్ అబ్డాల్కిన్ అనే చట్టసభ్యుడు తన కంప్యూటర్ లో పుతిన్ ప్రసంగం విన్నారు. ఈ సందర్భంగా తన చెవులకు నూడుల్స్ తగిలించుకున్నారు. “నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. నేను ప్రతిదీ అంగీకరిస్తున్నాను. గొప్ప ప్రసంగం. 23 ఏళ్లలో నేను అలాంటిది వినలేదు. ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది” అని చెప్పారు. అయితే ఈ చర్య ఎంపీ మిఖియల్ ను చిక్కుల్లోకి నెట్టింది. మిఖియల్ పై రష్యా కమ్యూనిస్టు పార్టీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందులో అంతపెద్ద తప్పు ఏముందని అనుకోవచ్చు.

‘టు హ్యాంగ్ నూడుల్స్ ఆన్ ఇయర్స్’ అనే ఇంగ్లిష్ జాతీయం ఒకటి ఉంది. దీని అర్థం.. వ్యక్తిని తప్పుదారి పట్టించడం లేదా మోసం చేయడం. అంటే పరోక్షంగా పుతిన్ ను ఈ మాటలు అన్నట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న ఉక్రెయిన్.. పుతిన్ మాటలను సొంత దేశంలోని ఎంపీలే నమ్మడం లేదంటూ విమర్శిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ సలహాదారు ఆంటోన్ హెరాషెంకో ట్వీట్ చేశారు. ‘‘నా చెవులకు నూడుల్స్ వేలాడదీయవద్దు అని అంటే.. నన్ను మోసం చేయకు, నాతో అబద్ధం చెప్పకు అని అర్థం’’ అని క్యాప్షన్ ఇచ్చారు. 

దీనిపై కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పుతిన్‌ ప్రసంగాన్ని ఎగతాళి చేసినందుకు సమర డూమా డిప్యూటీ మిఖాయిల్ అబ్దాల్కిన్‌ను శిక్షిస్తామని వెల్లడించింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.


More Telugu News