మెమో ఇవ్వలేదని ప్రిన్సిపాల్ పై పెట్రోల్ చల్లి నిప్పంటించిన స్టూడెంట్

  • తీవ్రగాయాలతో ఐదు రోజుల తర్వాత ఆసుపత్రిలో చనిపోయిన ప్రిన్సిపాల్
  • మధ్యప్రదేశ్ లో ఘటన.. పోలీసుల అదుపులో స్టూడెంట్
  • గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం జరిగింది.. తన మెమో ఇవ్వలేదని కోపం పెంచుకున్న మాజీ విద్యార్థి ఒకరు కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి చేశాడు. పెట్రోల్ చల్లి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలైన ప్రిన్సిపాల్.. ఐదు రోజుల తర్వాత శనివారం ఉదయం ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు సదరు స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇండోర్ లోని బీఎం ఫార్మసీ కాలేజీలో అశుతోష్ శ్రీవాస్తవ (24) ఫార్మసీ పూర్తిచేశాడు. అయితే, మార్క్ షీట్ విషయంలో కాలేజీ యాజమాన్యంతో గొడవపడ్డాడు. తన మెమో తనకు ఇవ్వడంలేదని పలుమార్లు కాలేజీకి వచ్చి గొడవ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని, కాలేజ్ ప్రిన్సిపాల్ విముక్త శర్మను చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ నెల 20న కూడా కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ తో వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ప్రిన్సిపాల్ పై చల్లి నిప్పంటించాడు. దీంతో విముక్త శర్మకు తీవ్రగాయాలయ్యాయి. దాడిలో శ్రీవాస్తవ కూడా గాయపడ్డాడు.

ప్రిన్సిపాల్ విముక్త శర్మను కాలేజీ యాజమాన్యం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆమె శరీరం 90 శాతం కాలిపోవడంతో ఐదు రోజుల తర్వాత ఈ రోజు ఉదయం తుదిశ్వాస వదిలారని డాక్టర్లు చెప్పారు. మరోవైపు, శ్రీవాస్తవకు చికిత్స అందించిన ఎంవై ఆసుపత్రి వైద్యులు గురువారం డిశ్చార్జి చేశారు. దీంతో పోలీసులు శ్రీవాస్తవను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయస్థానం శ్రీవాస్తవను రిమాండ్ కు పంపించింది. కాగా, శ్రీవాస్తవ బెదిరింపులపై గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ముందే చర్యలు తీసుకుంటే విముక్త ప్రాణాలతో ఉండేదని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. తన సోదరి ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.


More Telugu News