డీఆర్డీవోలో హనీట్రాప్ కలకలం

  • మిసైల్ పరీక్షకు సంబంధించిన వివరాలు లీక్ చేసినట్లు ఆరోపణలు 
  • పోలీసుల అదుపులో సీనియర్ ఉద్యోగి
  • అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు
భారత రక్షణశాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవోలో హనీట్రాప్ కలకలం రేగింది. సంస్థకు చెందిన ఉన్నత ఉద్యోగి ఒకరు విదేశీ ఏజెంట్లు పన్నిన వలపువలలో చిక్కుకున్నట్లు తెలిసింది. రక్షణ శాఖకు చెందిన పలు క్షిపణులు, రాకెట్ల ప్రయోగాలకు సంబంధించి కీలక సమాచారాన్ని వారితో పంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో సదరు ఉద్యోగిని శుక్రవారం అరెస్టు చేశారు. చాందీపూర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఒడిశాలోని చాందీపూర్ లో డీఆర్డీవోకు చెందిన ఐటీఆర్ లో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఒకరు పాకిస్థాన్ ఏజెంట్ల వలలో చిక్కుకున్నాడు. ఆపై వారి బెదిరింపులకు లొంగి రాకెట్, మిసైల్ ప్రయోగాలకు సంబంధించిన కీలక వివరాలను వారికి అందజేశాడు. ఉద్యోగి కదలికలపై అనుమానంతో ప్రశ్నించగా హనీట్రాప్ విషయం బయటపడింది. విచారణ తర్వాత ఆ ఉద్యోగిని అరెస్టు చేశామని చాందీపూర్ ఐజీ హిమాన్షు కుమార్ తెలిపారు.

ఆ ఉద్యోగిపై అధికార రహస్యాల చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120ఏ, 120బి కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగి ఫోన్ ను పరిశీలించగా.. అందులో పాకిస్థాన్ ఏజెంట్ తో సన్నిహితంగా చేసిన చాట్, న్యూడ్ ఫొటోలు, వీడియోలు కూడా కనిపించాయని వివరించారు. కాగా, 2021 లో కూడా చాందీపూర్ ఐటీఆర్ లోనే ఐదుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. అధికార రహస్యాలను లీక్ చేశారంటూ వారిని జైలులో పెట్టారు.


More Telugu News