మిస్డ్ కాల్ ఆధారంగా బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

  • ఢిల్లీ బాలిక కిడ్నాప్ కేసు విషాదాంతం
  • బాలిక హత్యకు గురైనట్టు గుర్తించిన పోలీసులు
  • ఘటన జరిగిన రోజు తల్లి ఫోన్‌కు మిస్డ్ కాల్
  • ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడి జాడ వెల్లడి
ఢిల్లీ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఓ మిస్డ్ కాల్ ఆధారంగా ఛేదించారు. నాంగ్లోయి ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఫిబ్రవరి 9న స్కూలుకని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో.. తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు బాలిక కోసం పరిసర ప్రాంతాలన్నీ జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. దీంతో.. వారు అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి అదృశ్యమైన రోజున తనకు ఓ మిస్డ్ ‌కాల్ వచ్చినట్టు బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. ఆ నెంబర్‌కు మళ్లీ కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ అయినట్టు తెలిసిందని ఆమె పేర్కొంది. 

ఈ సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రెయిడ్లు నిర్వహించి ఫిబ్రవరి 21న రోహిత్(21) అలియాస్ వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తానే బాలికను హత్య చేసినట్టు అంగీకరించాడు. శవాన్ని ఘెవ్రామోర్ ప్రాంతంలో పడేసినట్టు చెప్పాడు. దీంతో.. పోలీసులు నిందితుడు చెప్పిన చోటున బాలిక మృతదేహాన్ని కనుగొని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి అతడిని పోలీస్ కస్టడీకి పంపించారు. అయితే..రోహిత్ ఆ బాలికను చంపడానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్నది పోస్ట్‌మార్టం నివేదికతో తేలుతుందని పోలీసులు తెలిపారు.


More Telugu News