అంబులెన్స్ లో చెప్పులు, బూట్లు తరలించిన డ్రైవర్.. వేటువేసిన ప్రభుత్వం!

  • రాజస్థాన్ లో ప్రభుత్వ అంబులెన్స్ ను సొంత అవసరాలకు వాడుకున్న డ్రైవర్
  • జైపూర్ నుంచి దౌసాకు చెప్పులు, బూట్లు తరలింపు 
  • డ్రైవర్ ను విధుల నుంచి తొలగించిన అధికారులు
  • కేసు నమోదు చేస్తామని వెల్లడి 
సమయానికి అంబులెన్స్ లు రాక ప్రాణాలు కోల్పోయారని.. అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో మృతదేహాలను భుజాన వేసుకుని కాలినడకన వెళ్లారని తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడాల్సిన అంబులెన్స్ ను ఓ డ్రైవర్ సొంత అవసరాలకు వాడుకున్నాడు. 

రాజస్థాన్ లోని జైపూర్ నుంచి దౌసాకు అంబులెన్స్ లో చెప్పులు, బూట్లను ట్రాన్స్ పోర్ట్ చేశాడో డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అంబులెన్స్ దౌసా ప్రభుత్వ ఆసుప్రతికి చెందినదిగా గుర్తించారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫుట్ వేర్ ను తరలిస్తున్నట్లు తెలిసింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే డ్రైవర్ ను విధుల నుంచి తొలగించారు. 
 
‘‘అంబులెన్స్ డ్రైవర్ ను ఓ ఎన్జీవో నియమించింది. అతడిని విధుల్లో నుంచి తొలగించాం. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని దౌసా ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ శివరామ్ మీనా తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నిందితుడిపై నిర్ణీత సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ అంబులెన్స్ ను ఎమ్మెల్యే కోటాలో తెచ్చినట్లు సమాచారం.


More Telugu News