మనలో ప్రొటీన్ లోపాన్ని ఇలా తెలుసుకోవచ్చు..!

  • కండరాల నిర్మాణంలో ప్రొటీన్ల పాత్ర
  • వ్యాధి నిరోధక శక్తికి ప్రొటీన్లు ప్రాణం
  • అలసట, బలహీనత, అధిక ఆకలి ప్రొటీన్ల లోపానికి సంకేతాలు
  • కిలో శరీర బరువుకు 0.8 గ్రాములు అవసరం
ప్రొటీన్ అనేది అమైనో అమ్లాలతో తయారైన మైక్రో న్యూట్రియంట్. కండరాల నిర్మాణానికి ఇది ఎంతో అవసరం. కండరాల మరమ్మతులతోపాటు, శరీరానికి శక్తినివ్వడానికి కూడా ప్రొటీన్ అవసరం. హార్మోన్ల సమతుల్యతకు కూడా కావాలి. కణాల మెంబ్రేన్లకు అవసరమైనవి సరఫరా అయ్యేందుకు వీలుగా కెమికల్ రియాక్షన్ ను ప్రొటీన్ ప్రేరేపిస్తుంది. కిలో శరీర బరువుకు గాను 0.8 గ్రాముల ప్రొటీన్ ను రోజులో (పెద్దవారు) తీసుకోవాలన్నది ఒక ప్రామాణికం. మనకు ప్రొటీన్ తగినంత లేకపోతే కొన్ని రకాల సమస్యలు, సంకేతాలు కనిపిస్తాయి. వాటిని చూసి అయినా మనం అర్థం చేసుకోవాలి.

బలహీనత, అలసట, కండరాల నష్టం
ప్రొటీన్ లోపించడం వల్ల కండరాలను కోల్పోవాల్సి రావచ్చు. సన్నబడుతున్నావని ఎవరైనా చెప్పడం దీనికి సంకేతంగా చూడొచ్చు. అలాగే, బలహీనత, అలసట కూడా ప్రొటీన్ లోపాన్ని తెలియజేసే సంకేతాలే. ప్రొటీన్ లోపించడం వల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి. అందుకే బలహీనత అనిపిస్తుంది.

గాయాల నుంచి కోలుకోవడం ఆలస్యం
ఇటీవల ఏదైనా గాయం బారిన పడి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందా? అది కూడా ప్రొటీన్ లోపం వల్లేనా? అన్నది తెలుసుకోవాలి. శరీరంలో కావాల్సినంత ప్రొటీన్ లేకపోవడం వల్ల గాయాలు త్వరగా మానవు. కణాల పునర్నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు కారణం.

అధిక ఆకలి
అదే పనిగా ఆకలి వేస్తుండడం కూడా ప్రొటీన్ లోపాన్ని తెలియజేసేదే. ప్రొటీన్ తగినంత ఉంటే వెంటనే ఆకలి వేయదు. కనుక ఆహారంలో తప్పకుండా ప్రొటీన్ ను భాగం చేసుకోవాలి.

వ్యాధి నిరోధక శక్తి బలహీనం
ప్రొటీన్ లోపించడం వల్ల జబ్బున పడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండాలంటే ప్రొటీన్ కూడా అవసరమే. వ్యాధి నిరోధక కణాలు కూడా అమైనో యాసిడ్స్ తోనే తయారవుతాయి. కనుక ప్రొటీన్ కావాలి. 

ఇతర సంకేతాలు
గోర్లు బలహీనంగా ఉన్నా, విరిగిపోతున్నా, చర్మం ఎండిపోతున్నా, చర్మం పలుచబడుతున్నా ప్రొటీన్ లోపం వల్ల కావచ్చు.


More Telugu News