స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమ్మిన్స్.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఇతడేనా?

  • మూడో టెస్టు సమయానికి ఇండియాకు రాలేనన్న పాట్ కమిన్స్
  • ఆసీస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ వ్యవహరించే అవకాశం
  • గతంలో రెండుసార్లు జట్టును నడిపించిన సీనియర్ బ్యాట్స్ మన్ 
  • బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో 2-0తో వెనకబడిపోయిన ఆసీస్ 
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాతో తలపడుతున్న ఆస్ట్రేలియాను వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయింది. పలువురు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. మరోవైపు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. 

మార్చి 1న ఇండోర్ లో మూడో టెస్టు మొదలు కానుంది. కానీ ఆ సమయానికి తాను రాలేనని కమిన్స్ సమాచారమిచ్చాడు. ‘‘ఈ సమయంలో భారతదేశానికి రాకూడదని నిర్ణయించుకున్నా. ఇక్కడ నా కుటుంబంతో కలిసి ఉండటం ఉత్తమమని భావిస్తున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులకు ధన్యవాదాలు’’ అని కమిన్స్ చెప్పినట్లు ఓ క్రికెట్ వెబ్ సైట్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ ను నడిపించేది ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ బ్యాట్స్ మన్, గతంలో కెప్టెన్ గా పనిచేసిన స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. 

రెండో టెస్టు తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో స్మిత్ తన భార్యతో కలిసి దుబాయ్ లో పర్యటించాడు. గురువారం సాయంత్రం మళ్లీ జట్టుతో కలిశాడు. మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ కు ఇతడే నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

స్మిత్ గతంలో రెండు సార్లు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2017లో ఇండియా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు వచ్చినప్పుడు స్మిత్ కెప్టెన్ గా ఉన్నాడు. నాడు 2-1 తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇక మూడో టెస్టులో కమ్మిన్స్ స్థానంలో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు.


More Telugu News