పాక్ సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందన ఇదే

  • ప్రాథమిక పరిశ్రమ ఉగ్రవాదం అయితే పరిష్కారం ఉండదన్న జైశంకర్
  • అలాంటి దేశం సమస్యల నుంచి బయటకు రాలేదని వ్యాఖ్య 
  • భారత్-పాకిస్థాన్ మధ్య ఉగ్రవాదమే కీలక సమస్యని స్పష్టీకరణ
పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై ఓ మీడియా ప్రతినిధి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ముందు ప్రస్తావించారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న జైశంకర్ దీనికి తనదైన శైలిలో బదులిచ్చారు. ఏదైనా ఒక దేశానికి ప్రాథమిక పరిశ్రమ ఉగ్రవాదం అయితే, క్లిష్ట పరిస్థితుల నుంచి అది బయటకు రాలేదని తేల్చి చెప్పారు. విదేశాంగ శాఖ పూణెలో వార్షిక ఆసియా ఆర్థిక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. 

ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రత్యేక బంధానికి (పాకిస్థాన్-భారత్) సంబంధించిన వాస్తవం ఏమిటంటే.. మనం తప్పించుకోలేని మూల సమస్య ఇందులో ఉంది. అది ఉగ్రవాదం. ఒక దేశంగా (పాకిస్థాన్) ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలి. రాజకీయ అంశాలను పరిష్కరించుకోవాలి. సామాజిక అంశాలనూ పరిష్కరించుకోవాలి. దేశ ప్రాథమిక పరిశ్రమే ఉగ్రవాదం అయితే, అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు వచ్చి సంపన్న శక్తిగా అవతరించలేదు’’ అని జైశంకర్ స్పష్టం చేశారు. పొరుగు దేశం తీవ్ర ఆర్థిక సమస్యల్లోకి కూరుకుపోవాలని ఏ దేశమూ కోరుకోదన్నారు.  

మరోవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అత్యవసర సమావేశంలోనూ పాకిస్థాన్ ఉగ్రవాదం అంశాన్ని భారత కౌన్సిలర్ ప్రతీక్ మాథుర్ లేవనెత్తారు. ‘‘పాకిస్థాన్ తన ట్రాక్ రికార్డును చూసుకోవాలి. ఉగ్రవాదులకు సురక్షిత కేంద్రంగా వ్యవహరిస్తోంది’’ అని పేర్కొన్నారు.


More Telugu News