స్కూటర్లలో ఇది ‘ఎస్ యూవీ’ అట.. బెంగళూరు సంస్థ క్లెయిమ్

  • రివర్ ఇండీ పేరుతో విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ 
  • ఎక్స్ షోరూమ్ ధర రూ.1,25,000
  • ముందస్తు బుకింగ్ లు ప్రారంభం.. ఆగస్ట్ నుంచి డెలివరీ
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘రివర్’ ఇండీ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. కార్లలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ) మాదిరే.. స్కూటర్లలో రివర్ ఇండీ కూడా ఎస్ యూవీ మాదిరిగా ఉంటుందని సంస్థ అంటోంది. 

గత రెండేళ్ల కాలంలో ఈ స్కూటర్ ను సంస్థ అభివృద్ధి చేసింది. బెంగళూరు ఎక్స్ షోరూమ్ ధర రూ.1.25 లక్షలు. దీనికి రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులు అదనం. ముందస్తు ఆర్డర్లను తీసుకుంటున్నామని, ఈ ఏడాది ఆగస్ట్ నుంచి డెలివరీలు చేస్తామని సంస్థ ప్రకటించింది. 

ఇందులో మిడ్ డ్రైవ్ పర్మెనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. 9 బీహెచ్ పీ గరిష్ఠ శక్తిని విడుదల చేస్తుంది. పీక్ టార్క్ 26ఎన్ఎంగా ఉంటుంది. ఈకో, రైడ్, రష్ అనే మూడు మోడ్స్ ఉన్నాయి. గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. 4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, ఐపీ 67 రేటింగ్ తో ఉంటుంది. ఐదు గంటల్లో 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి చార్జింగ్ తో 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 43 లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ ఉంది. 5 ఏళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వరకు వాహనం, మోటారుపై కంపెనీ వారంటీ ఇస్తోంది.


More Telugu News