నిమ్స్ ఐసీయూకి వెళ్లి ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న గవర్నర్ తమిళిసై

  • ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన గవర్నర్
  • కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి
  • మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించిన అధికారులు
వరంగల్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ పీజీ వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతికి నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో వేధింపులు తాళలేక ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రీతిపై వేధింపులకు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. 

కాగా, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం స్వయంగా నిమ్స్ కు వెళ్లి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పీపీఈ కిట్ ధరించిన గవర్నర్.. ఐసీయూలో ప్రీతిని చూశారు. ఆమెకు అందింస్తున్న చికిత్స వివరాలను అక్కడి వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 

పీజీ వైద్య విద్యార్థినిని ఇలా ఐసీయూ లో బెడ్ పై చూడటం బాధగా ఉందన్నారు. ప్రీతి ప్రాణాలను కాపాడేందుకు నిమ్స్ ఉత్తమ వైద్య సంరక్షణను అందిస్తుందని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉన్నత వైద్య విద్యలో ఒత్తిడిని నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరపాలని గవర్నర్ చెప్పారు.


More Telugu News