రక్తమోడిన చత్తీస్‌గఢ్ రహదారులు.. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృత్యువాత

  • పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు
  • కుటుంబ వేడుకకు హాజరై వస్తుండగా ఘటన
  • మరో ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతి
  • ఇంకో ఘటనలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులకు తీవ్ర గాయాలు
చత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భాతపరా జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఓ ట్రక్కు పికప్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.  

భాతపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితులకు తొలుత సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. బాధితులు ఓ కుటుంబ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసు అధికారులు తెలిపారు.  

కాగా, రుదౌలి కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిన్న జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మోటార్ సైకిల్‌ను ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అక్కడికి కిలోమీటరు దూరంలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొట్టిన తర్వాత బోల్తా పడడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.


More Telugu News