జనసేనతో పొత్తుపై బీజేపీది లోపలో మాట.. బయటో మాట: టీడీపీ నేత కన్నా

  • భీమవరం డిక్లరేషన్‌లో జనసేన పేరు ప్రస్తావించలేదన్న కన్నా
  • అమరావతిపై మాట్లాడినందుకు తనను చంద్రబాబు ఏజెంట్ అన్నారని గుర్తు చేసుకున్న టీడీపీ నేత
  • ప్రజలు టీడీపీ-జనసేన పొత్తును కోరుకుంటున్నారన్న కన్నా
జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీ నాయకులు బయటకు చెబుతుంటారని, కానీ లోపల మాత్రం పొత్తులు ఉండవని అంటున్నారని అన్నారు. భీమవరం డిక్లరేషన్‌లోనూ జనసేన పేరు ప్రస్తావించలేదని కన్నా గుర్తు చేశారు. జనసేనతో పొత్తు విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు ఏజెంట్ అని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. 

రాజధాని అమరావతిపై తాను మాట్లాడినప్పుడు తనపైనా అదే ముద్ర వేశారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పడాలన్నా, రాజధానిగా అమరావతి అభివృద్ధి జరగాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని, అందుకనే ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారు కూడా మనసు చంపుకుని నియంత వద్ద కొనసాగుతున్నారని అన్నారు. 

తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టు కన్నా చెప్పారు. చంద్రబాబు, పవన్ కూర్చుని మాట్లాడుకుని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. గత రాత్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహించిన చర్చలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News