ఎన్నివిధాలుగా కష్టపడినా కన్నాను ఓడించలేకపోయాం: చంద్రబాబు

  • టీడీపీలో చేరిన కన్నా.. సాదరంగా స్వాగతం పలికిన చంద్రబాబు
  • కన్నా హుందాతనం ఉన్న నేత అని కొనియాడిన టీడీపీ అధినేత
  • కన్నాకు ప్రజల్లో ఎంతో మంచి గుర్తింపు ఉందని వెల్లడి
  • కన్నా టీడీపీలో చేరడం శుభపరిణామం అని వ్యాఖ్యలు
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేడు భారీ అనుచరగణంతో టీడీపీలో చేరారు. కన్నాకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కన్నాను మనస్ఫూర్తిగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు. కన్నా వంటి నేత టీడీపీలోకి రావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. 

కన్నా లక్ష్మీనారాయణతో కలిసి కన్నా నాగరాజు, తాళ్ల వెంకటేశ్ యాదవ్, కన్నా ఫణీంద్ర, తురగా నాగభూషణం, శృంగారపాటి ఆనందబాబు, అడపా శివనాగేంద్ర, ఎస్ఎమ్ నిజాముద్దీన్, బడేటి గోపాల్, కొమిరిశెట్టి సాంబశివరావు, పాలేటి మాధవరావు, పెండ్యాల శ్రీనివాసరావు, పులి వెంకటచలపతిరావు, గుడివాక రామాంజనేయులు, ఏల్పూరి వెంకటేశ్వరరావు, మరో 39 మంది నేతలు, వందల సంఖ్యలో ఉన్న వారి అనుచరులు కూడా నేడు టీడీపీలో చేరారని చంద్రబాబు వెల్లడించారు. 

"ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంత ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత కన్నా లక్ష్మీనారాయణ. రాజకీయాల్లో ఆయనను చూశాను, అసెంబ్లీ వేదికగా చూశాను, మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చూశాను. విద్యార్థి దశ నుంచి కన్నా జీవితాన్ని ఆయన 73 నుంచి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నేతగా చేరి, అంచెలంచెలుగా ఎదిగారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఒకసారి పెదకూరపాడులో కన్నా పోటీ చేస్తే ఆయనను ఓడించాలని అన్ని విధాలుగా కష్టపడ్డాం. ఆయన ఉన్నంతవరకు టీడీపీని గెలిపించడం సాధ్యం కాలేదు. ప్రజలతో ఆయనకు ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటాయో దీన్నిబట్టే అర్థమవుతుంది. 2004 నుంచి 2014 వరకు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేశారు. ఏ నాయకుడైనా సిద్ధాంతపరంగా పనిచేస్తే శాశ్వతంగా గుర్తింపు పొందుతారు. అలాంటి నేతల్లో కన్నా ఒకరు. రాజకీయాల్లో హుందాతనం, నిబద్ధత, పద్ధతి ఉన్న నేత కన్నా. 

రాజకీయపరంగా విభేదాలు ఉన్నా, కన్నాతో వ్యక్తిగతంగా మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఎప్పుడూ మేం పరస్పరం విమర్శించుకోలేదు. కన్నాను ఇవాళ ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నామో అందరూ అర్థం చేసుకోవాలి. సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి" అంటూ ప్రసంగించారు. 

పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రగతికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత కన్నా మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. కన్నా ప్రసంగం తర్వాత చంద్రబాబు మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

"కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని కూడా కాదనుకుని రాష్ట్రంలో విపక్షంలో చేరారంటే అందరూ అర్థం చేసుకోవాలి. ఆయన ఒకటే ఆలోచించారు. మళ్లీ రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నా, అమరావతే రాజధాని అవ్వాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని ఆయన భావించారు. 

రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ఇంత డ్యామేజి చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. పరిపాలన మొత్తం రివర్స్ చేసి తన విధ్వంసక స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. పరిపాలనలోకి వచ్చిన మొదట్లోనే ప్రజావేదికను కూల్చేశారు. ప్రజావేదికలోనే కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, ఈ ప్రజావేదికనను ఈరోజే కూల్చేస్తున్నామంటూ సాయంత్రానికి కూల్చేశారు. దీన్నిబట్టే అతడెంత భయంకరమైన మనిషో ఆలోచించాలి. ప్రజావేదిక నా సొంత ఆస్తి కాదు. ప్రజల పన్నులతో కట్టిన భవనం అది. ప్రజాధనం అంటే అతడికెంత లెక్కలేనితనమో అక్కడ్నించే ప్రారంభమైంది. 

రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సంక్షేమం కోసం పాటుపడ్డారు. కొందరు అసమర్థ సీఎంలు, అవినీతి సీఎంలు ఉన్నారు. కానీ ఇంతటి విధ్వంసకర సీఎంలు ఎవరూ లేరు. ఈ ముఖ్యమంత్రి ధాటికి అన్ని వ్యవస్థలు దాడులకు గురయ్యాయి. జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది. రాష్ట్రంలో డబ్బంతా ఆయన దగ్గరే ఉండాలనుకుంటారు. బెదిరించి ఆస్తులు రాయించుకునేవారిని ఉగ్రవాది కాక మరేమంటారు?

పేదల ప్రాణాలతో ఆడుకుంటూ ఫేక్ మద్యం బ్రాండ్లు తీసుకువచ్చాడు. జగన్ ధనవంతుడవుతున్నాడు... ప్రజలు పేదవాళ్లవుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఎన్జీవోలకు నేను కూడా భయపడేవాడ్ని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్జీవోలు ఎక్కడున్నారో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ల కోసం కూడా మనమే పోరాడాలి. వాళ్లు పోరాడితే ఏసీబీనో, మరో కేసో పెడుతున్నారు. 

ఒకప్పుడు మీడియాను చూస్తేం మేం భయపడేవాళ్లం. ఇప్పుడు మీడియా పరిస్థితి ఏంటి? మీడియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వాళ్ల వ్యాపారాలపైనా దాడులు చేయిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి బరితెగించాడు. రాజశేఖర్ రెడ్డి నేను సీఎంగా ఉన్నప్పుడే పాదయాత్ర చేశాడు... మేం ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఇదే ముఖ్యమంత్రి కూడా పాదయాత్ర చేశాడు... నన్ను బంగాళాఖాతంలో విసిరేయాలన్నాడు, చెప్పులతో కొట్టించాలన్నాడు... ఆ రోజు నేను తలుచుకుని ఉంటే నువ్వు బయటికి వచ్చేవాడివా... నాకు ఒక్క సెకను పని అది. నువ్వేమైనా పుడింగివా! రాజకీయాల్లో హుందాతనం అవసరం" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News