‘ఉస్తాద్’ గా వస్తున్న కీరవాణి కొడుకు శ్రీ సింహా

  • మత్తు వదలరా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా
  •  ఫణిదీప్ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రకటన
  • పైలట్ పాత్రలో కనిపించనున్న యువ హీరో
ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం నుంచి తొలి హీరోగా వచ్చిన వ్యక్తి ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి. పలు చిత్రాల్లో చైల్డ్ అర్టిస్ట్ గా నటించిన శ్రీ సింహా.. మత్తు వదలరా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వైవిధ్యభరితమైన ఆ చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, అవి అంతగా ఆడలేదు.  ప్రస్తుతం భాగ్ సాలే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 

దీనికి ఉస్తాద్ అనే టైటిల్ ఖరారు చేశారు.  ఈ రోజు శ్రీ సింహా పుట్టిన రోజు సందర్భంగా  ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీ సింహా నిర్భయమైన పైలట్ పాత్రలో నటిస్తున్నాడు. ‘తన కలలకు రెక్కలు తొడిగి చిన్న పట్టణం నుంచి ఆకాశం వరకు ఎదిగిన నిర్భయమైన పైలట్ ను కలవండి’ అంటూ  పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాకు పవన్ కుమార్ పప్పుల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, అకీవ సంగీతం అందించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News