3 గంటలపాటు స్తంభించిన చిన్నారి గుండె.. కాపాడిన వైద్యులు

  • స్విమ్మింగ్‌ పూల్‌లో పడిన 20 నెలల బాలుడు
  • 3 గంటల పాటు నిలిచిపోయిన గుండె
  • వైద్య బృందం నిర్విరామ కృషితో తప్పిన ప్రాణాపాయం
కెనడా వైద్యులు అద్భుతం సాధించారు. మూడు గంటల పాటు స్తంభించిపోయిన చిన్నారి గుండెను మళ్లీ కొట్టుకునేలా చేసి బిడ్డను కాపాడారు. ఓంటారియో రాష్ట్రం పెట్రోలియా ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. 20 నెలల బాలుడు వేలన్ సాండర్స్ స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్జీవంగా తేలుతున్న దృశ్యాన్ని అతడి సంరక్షకురాలు(బేబీసిట్టర్) గమనించారు. అతడు స్విమ్మింగ్‌పూల్‌లో పడ్డ 4 నిమిషాలకు గుర్తించిన ఆమె బాలుడిని సమీపంలోని షార్లెట్ ఎలీనార్ ఎంగల్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. 

ఆ ఆసుపత్రిలో బిడ్డ చికిత్సకు కావాల్సిన ఆధునాతన పరికరాలేవీ అందుబాటులో లేవు. బిడ్డను మరో ఆసుపత్రికి తరలించేంత సమయం కూడా లేదు. దీంతో..సిబ్బంది బాలుడిని రక్షించేందుకు తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించారు. డాక్టర్లు, సిబ్బంది వంతుల వారీగా బాలుడికి సీపీఈఆర్ నిర్వహించారు. అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రయత్నాలు ఫలించి బాలుడు స్పృహలోకి వచ్చాడు. ఫిబ్రవరి 6న డిశ్చార్జ్ అయిన అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. 

‘‘సిబ్బంది మొత్తం బాలుడి ప్రాణాలు నిలబెట్టేందుకు శ్రమించింది. సిబ్బంది ఒక్కొక్కరూ వంతుల వారీగా బాలుడు మళ్లీ శ్వాసతీసుకునేలా ప్రయత్నించారు. ఈ క్రమంలో లండన్ ఆసుపత్రి వైద్యులు తమకు వెన్నంటి ఉంటూ సలహాలు ఇచ్చారు’’ అని షార్లెట్ ఆసుపత్రి వైద్యులు డా. టేలర్ వివరించారు.


More Telugu News