రాజ్‌భవన్‌ను కాఫీ షాప్ గా మార్చేశారు.. తమిళనాడు గవర్నర్ పై మంత్రి విమర్శలు

  • తమిళనాడులో గవర్నర్ రవికి, ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న విభేదాలు
  • ఆర్మీ జవాను ప్రభు హత్య తీవ్ర ఆందోళన కలిగించే అంశం అంటూ ట్వీట్ చేసిన రాజ్ భవన్
  • పని లేనివారిని రాజ్ భవన్ కు ఆహ్వానిస్తున్నారని మంత్రి పొన్ముడి విమర్శ
తమిళనాడు కృష్ణగిరిలో ఆర్మీ జవాను ఎం. ప్రభు హత్య తీవ్ర ఆందోళన కలిగించే అంశం అంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌.ఎన్. రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి ఎదురుదాడికి దిగారు. ఆర్‌.ఎన్. రవి.. రాజ్‌భవన్‌ను కాఫీ షాప్ గా మార్చారని పొన్ముడి ఆరోపించారు. 

ఆర్మీ జవాను ప్రభు హత్యపై  పార్టీ మాజీ సైనికుల విభాగం సభ్యులతో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్ కె అన్నామలైతో గవర్నర్ సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘పని లేని వారిని ఆహ్వానించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ద్వారా రాజ్‌భవన్‌ను కాఫీ షాప్‌గా మార్చడం గవర్నర్‌ పని కాకూడదు’ అని పొన్ముడి విమర్శించారు. కాగా, బీజేపీ నేతలతో సమావేశం అనంతరం రాజ్ భవన్.. ఆర్మీ జవాన్ హత్యను 'తీవ్ర ఆందోళన కలిగించే అంశం'గా అభివర్ణిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు లేవనెత్తింది. 

దీనిపై పొన్ముడి ఘాటుగా స్పందించారు ‘ఓ రాజకీయ పార్టీ ఉద్దేశపూర్వకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు చేసిన అభ్యర్థనను ప్రచురిస్తున్న రాజ్‌భవన్‌ ఆన్‌లైన్‌.. జూద నిషేధ బిల్లు పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తుందా? ఇతర పెండింగ్ బిల్లుల గురించి వారికి చెబుతుందా?’ అని ప్రశ్నించారు. వ్యక్తిగత వివాదాల వల్లే ఆర్మీ జవాన్ ప్రభు హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితుడు డీఎంకేకు చెందిన కౌన్సిలర్ కావడం మినహా ఈ వ్యక్తిగత సమస్యకు రాజకీయ కోణం లేదు’ అని అన్నారు.


More Telugu News