బీబీసీకి అండగా యూకే ప్రభుత్వం.. భారత్‌పై ఒత్తిడి తేవాలంటూ అమెరికాకు బ్రిటన్ ప్రతిపక్ష ఎంపీల విజ్ఞప్తి

  • బీబీసీపై ఐటీ రెయిడ్‌ల విషయం భారత్‌తో చర్చించామని ప్రకటన
  • బీబీసీకి నిధులు సమకూరుస్తున్నామని స్పష్టీకరణ  
  • ఎడిటోరియల్ స్వేచ్ఛ ఉండాలని ఆశిస్తున్నామని వ్యాఖ్య 
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ రూపొందించిన ప్రముఖ వార్తా సంస్థ బీబీసీకీ ఆ దేశ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ విషయమై యూకే ప్రభుత్వం తొలిసారిగా బహిరంగంగా స్పందించింది. బీబీసీ అంశంపై భారత ప్రభుత్వంతో చర్చించామని ప్రభుత్వ ప్రతినిధి ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా పేర్కొన్నారు. ఇటీవల భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వేలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. 

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ రెయిడ్లపై మంగళవారం బ్రిటన్ పార్లమెంటులో వాడీవేడిగా చర్చ జరిగింది. ‘‘మేము బీబీసీకి నిధులు సమకూరుస్తున్నాం. అండగా ఉన్నాం. బీబీసీకి ఎడిటోరియల్ స్వేచ్ఛ ఉండాలని ఆశిస్తున్నాం’’ అని బ్రిటన్ విదేశీ, కామన్‌వెల్త్, అభివృద్ధి వ్యవహారాల శాఖ  అండర్ సెక్రెటరీ డేవిడ్ రట్లీ పార్లమెంటులో పేర్కొన్నారు. 

భారత్‌తో వివిధ అంశాలపై చర్చించామని పేర్కొన్న ఆయన.. ఐటీ రెయిడ్ల విషయం కూడా చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. మీడియా ఎడిటోరియల్ స్వాతంత్ర్యాన్ని రక్షించాల్సిన అవసరాన్ని భారత్‌తోపాటూ మిత్ర దేశాలన్నిటికీ చెప్పాలని కోరారు. అంతకుమునుపు.. అధికార పార్టీపై ప్రతిపక్ష సభ్యులు దుమ్మెత్తిపోశారు. బీబీసీ విషయంలో మౌనం పాటించడం సబబు కాదని మండిపడ్డారు. అమెరికా, ఇతర మిత్రదేశాల సాయంతో బ్రిటన్ భారత్‌పై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.


More Telugu News