టీడీపీ ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్న లోకేశ్.. ఈనాటి పాదయాత్ర హైలైట్స్

  • 24వ రోజును పూర్తి చేసుకున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • ఇప్పటి వరకు 329 కి.మీ. మేర కొనసాగిన యాత్ర
  • ప్రస్తుతం రేణిగుంట మండలంలో కొనసాగుతున్న పాదయాత్ర
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 24వ రోజును పూర్తి చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజవర్గంలోని కోబాకలోని విడిది కేంద్రం నుంచి ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభమయింది. పాదయాత్ర సందర్భంగా పాత వీరాపురం, కొత్త వీరాపురం గ్రామాల్లో లోకేశ్ ను పూలమాలలతో జనం ఘనంగా సత్కరించారు. 

మోదుగులపాలెంలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడేందుకు ప్రయత్నించిన లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిలబడిన స్టూల్ ను కూడా లాగేసే ప్రయత్నం చేశారు. అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. అనంతరం పాపానాయుడు పేట, కందాడ, గోవిందవరం, సదాశివపురం గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగింది. లోకేశ్ పాదయాత్ర ఇప్పటి వరకు 329 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈనాటి పాదయాత్ర రేణిగుంట మండలం జీలపాలెం క్యాంప్ సైట్ వద్ద ముగిసింది. 

తన పాదయాత్రలో ప్రజలతో ముఖాముఖి సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... సీఎం జగన్ వికృత చేష్టలకు తాను భయపడనని తెలిపారు. తాను మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్లను అడ్డుకోకుండా.. పోలీసులు తనను అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. జగన్ ఆగడాలు శృతిమించాయని... తాను శాంతియుతంగా, గాంధేయమార్గంలో పాదయాత్ర చేస్తుంటే జగన్ అడ్డుకుంటున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, ప్రజల తరపున పోరాడుతుంటే జగన్ తమ గొంతు నొక్కుతున్నాడని అన్నారు. చంద్రబాబును చూస్తే కంపెనీలు గుర్తొస్తాయి, జగన్ ను చూస్తే జైలు గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు.

పోలీసుల ప్రవర్తన రోజురోజుకూ వింతగా మారుతోందని అన్నారు. తాను ప్రజల్ని చూడటానికి స్టూలు ఎక్కితే దాన్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాను మైకుతో మాట్లాడకపోయినా అడ్డుకుంటున్నారని అన్నారు. లోకేశ్ ఎక్కడికి వస్తే పోలీసులు అక్కడికి వస్తారని... కానీ అత్యాచారాలు చేసిన వాళ్ల దగ్గరకు మాత్రం వెళ్లి పట్టుకోరని దుయ్యబట్టారు.

'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ రెడ్డి మోసం చేశాడు. విద్యార్థులకు సరిగ్గా ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. కార్మికులకు పని దొరకడం లేదు. నా స్వరం ఎన్టీఆర్ ఇచ్చింది.. దాన్ని నొక్కేయలేరు. జగన్ అరాచకాలకు నేను భయపడను. నేను పరదాలు కట్టుకుని ప్రజల్లోకి రావడం లేదు. రైతులు, రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు రావాలి. అందుకే బాబు రావాలి.. బాధలు పోవాలి అని అంటున్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది' అని చెప్పారు.


వ్యవసాయ శాఖ మంత్రి ఓ కోర్టు దొంగ... రైతుల సంక్షేమాన్ని వ్యవసాయశాఖ మంత్రి పట్టించునే పరిస్థితి లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడవ స్థానంలో ఉందని... ఇది జగన్ రెడ్డి చేతకానితనమేనని అన్నారు. చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర, సబ్సిడీలు, పంటనష్టం బీమా అందించామని... జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీటిని రద్దు చేశారని విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుధ్ది ఉన్నా రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.


More Telugu News