టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

  • గన్నవరం ఘటనలో పట్టాభి సహా 13 మంది అరెస్ట్ 
  • పోలీసుల విజ్ఞప్తి మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అంగీకారం
  • సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
గన్నవరం ఘటనలో అరెస్ట్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం సహా 13 మంది టీడీపీ నేతలను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు పట్టాభి సహా 13 మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దాడిని న్యాయమూర్తి దృష్టికి పట్టాభి తీసుకెళ్లారు. తోట్లవల్లేరు స్టేషన్‌కు వెళ్లే సరికి అంతా చీకటిగా ఉందని, ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి తనను అరగంటపాటు కొట్టారని, ఆ తర్వాత వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని తెలిపారు. అంతేకాక, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించినట్టు చెప్పారు. 

కాగా, పట్టాభి సహా టీడీపీ నేతలు తనకు ప్రాణ హాని కలిగించే ప్రయత్నం చేశారని సీఐ కనకారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దీంతో పట్టాభి సహా మొత్తం 13 మంది టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

పట్టాభిని తొలుత గన్నవరం సబ్ జైలుకు తరలించాలని గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆదేశించారు.  అయితే, శాంతి భద్రతల దృష్ట్యా గన్నవరం సబ్ జైలుకు కాకుండా వేరే జైలుకు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. గన్నవరంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఆయనను అక్కడికి తరలిస్తే గొడవలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పట్టాభి సహా టీడీపీ నేతలను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.


More Telugu News