దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు

  • దేశంలో అన్ని సమస్యలు పెరిగిపోతున్నాయన్న తోట చంద్రశేఖర్
  • కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమయిందని వ్యాఖ్య
  • బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అన్న చంద్రశేేఖర్
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని... అన్ని సమస్యలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. నిరుద్యోగం భారీగా పెరుగుతోందని, రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని, తాగు, సాగు నీటి సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పారు. ప్రజలంతా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఆర్థిక వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టు లేదని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమయిందని... బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. 

రాష్ట్ర విభజనతో ఏపీకి కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయని చంద్రశేఖర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు తదితర విషయాలలో కేంద్రం చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని... తెలంగాణ తరహాలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్వశక్తితో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదగడాన్ని వచ్చే ఎన్నికల్లో చూస్తారని చెప్పారు.


More Telugu News