గవర్నర్ పాదాలకు నమస్కరించి.. ఘనంగా వీడ్కోలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్

  • ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీపై వెళ్లిన బిశ్వభూషణ్ హరిచందన్
  • గన్నవరం విమానాశ్రయంలో ప్రభుత్వ ఆత్మీయ వీడ్కోలు
  • 24న నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ మూడున్నరేళ్ల పదవీకాలం ముగిసింది. ఆయన ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్లిపోయారు. నూతన గవర్నర్ గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు రాష్ట్రానికి రానున్నారు. 24న గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరోపక్క, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నేడు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనమైన ఆత్మీయ వీడ్కోలు పలికారు. తద్వారా గవర్నర్ పట్ల తన గౌరవం చాటుకున్నారు. ముందుగా గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యంగా గవర్నర్ పాదాలకు నమస్కరించి ముఖ్యమంత్రి జగన్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లిపోవడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి, గవర్నర్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పాలనను బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఏ వర్గాన్నీ కూడా విస్మరించడం లేదని అభినందించారు. గవర్నర్ కు వీడ్కోలు పలికిన వారిలో మంత్రి జోగి రమేశ్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.


More Telugu News