అమ్మాయిల ఫోన్ల వినియోగంపై నిషేధం విధించిన గుజరాత్‌ ఠాకూర్ సమాజం

  • పలు సంస్కరణలు తీసుకొచ్చిన ఠాకూర్ కమ్యూనిటీ
  • మొబైల్ ఫోన్ల వల్ల అమ్మాయిలు పెడదారి పట్టే అవకాశం ఉందన్న పెద్దలు
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో తీర్మానాన్ని ఆమోదించిన కమ్యూనిటీ
  • నిశ్చితార్థానికి 11 మంది, పెళ్లికి 51 మంది అతిథులకు మాత్రమే అవకాశం
  • వివాహాల్లో డీజే వినియోగంపైనా నిషేధం
  • ఉల్లంఘిస్తే భారీ జరిమానా
అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వినియోగించడాన్ని గుజరాత్‌లోని ఠాకూర్ కమ్యూనిటీ నిషేధించింది. ఈ మేరకు సంప్రదాయాన్ని సంస్కరించే తీర్మానం చేసింది. మొబైల్ ఫోన్లు వాడడం వల్ల అమ్మాయిలు పెడదారి పట్టే అవకాశం ఉందని సంఘం భావించింది. అందుకనే వివాహం కాని అమ్మాయిల ఫోన్ల వాడకంపై నిషేధం విధించినట్టు పేర్కొంది. అయితే, ప్రేమ వ్యవహారాలు, అమ్మాయి-అబ్బాయి స్నేహాలు, కులాంతర వివాహాల గురించి ప్రస్తావించలేదు.  

కాంగ్రెస్ ఎమ్మెల్యే జెనీబెన్ ఠాకూర్ సమక్షంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. బనస్కాంత జిల్లా భభర్ తాలూకాలోని లున్సెలా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, నిశ్చితార్థం, పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. నిశ్చితార్థానికి 11 మంది, వివాహానికి 51 మంది అతిథులకు మించడానికి వీల్లేదు. ప్రతి గ్రామంలోనూ ఠాకూర్ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఖర్చులు తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివాహాల్లో డీజేను ఉపయోగించడంపైనా నిషేధం విధించారు. 

తమ సామాజిక వర్గం వారు ప్రతి ఒక్కరూ ఈ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. జరిమానాల ద్వారా వచ్చే సొమ్మును విద్యతోపాటు తమ సామాజిక వర్గంలో సౌకర్యాలకు ఖర్చు చేస్తామని సంఘం ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం గ్రామం నుంచి బాలికలు నగరాలకు వెళ్లేటప్పుడు వారికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని సంస్కరణల్లో పేర్కొన్నారు.


More Telugu News