ఏపీలో అరాచక పాలన నడుస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

  • పోలీసులు కూడా వారికే వంతపాడుతున్నారన్న కన్నా 
  • అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య 
  • గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటన
  • ఈ నెల 23న టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించిన కన్నా  
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన మొదలైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నియంత్రించేందుకు చర్యలు తీసుకుని, పకడ్బందీగా అమలు చేశారని చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని కన్నా మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు. దీనికి పోలీసులు కూడా వంతపాడుతున్నారని ఫైర్ అయ్యారు.

తన యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కళ్ల ముందే అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపించారు. అన్యాయం జరిగిందంటూ వచ్చిన వారికి న్యాయం చేయకుంటే పోలీసు వ్యవస్థపై బాధితుల మనసుల్లో కక్ష పెరుగుతుందని కన్నా చెప్పారు. ఈ విధంగా రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలు పెరగడానికి పోలీసులు కూడా కారణమవుతున్నారని, ఇది మంచిది కాదని డీజీపీని హెచ్చరించారు. బాధితులపైనే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తోపాటు పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజలు తిరగబడిన రోజు ఏ పదవీ ఉండదని రాజకీయ నాయకులు గుర్తించాలని చెప్పారు. తెలుగుదేశం ప్రతినిధి పట్టాభిని సోమవారం పోలీసులు తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆయన కనిపించడంలేదని అన్నారు. పట్టాభి తప్పు చేసి ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలని, లేదంటే ఆయన ఎక్కడున్నాడో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత డీజీపీపైన ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తనతో పాటు తన అనుచరులు, నేతలు కూడా టీడీపీలో చేరతారని వెల్లడించారు.


More Telugu News