కట్నం కింద పాత ఫర్నిచర్.. పెళ్లి రద్దు చేసుకున్న వరుడు

  • హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన
  • అడిగినవి ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన వరుడి కుటుంబం
  • వధువు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు  
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యవకుడు తన పెళ్లిని అర్థాంతరంగా రద్దు చేసుకున్నాడు. కట్నం కింద అమ్మాయి తల్లిదండ్రులు పాత ఫర్నిచర్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. అత్తామామల తీరు నచ్చని అల్లుడు వారితో వాగ్వివాదానికి దిగాడు. చివరకు తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేశాడు. అతడిపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడిని మహమ్మద్ జకీర్ (25)గా గుర్తించారు. అతడు బస్ డ్రైవర్ గా జీవిస్తున్నాడు. 22 ఏళ్ల హీనా ఫాతిమాతో వివాహం నిశ్చయమైంది. వాస్తవానికి ఆదివారం వీరి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయానికి వరుడు రాలేదు. ముహూర్తం దాటిపోయి, గంటలు గడిచినా రాలేదు. చివరకు చేసేదేమీలేక వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పాత ఫర్నిచర్ ఇవ్వడంతో ప్రశ్నించేందుకు తాను వెళ్లినప్పుడు, అమ్మాయి తరఫు వారు తన పట్ల దురుసుగా ప్రవర్తించారన్నది జకీర్ ఆరోపణగా ఉంది. ‘‘అడిగినవి ఇవ్వలేదని, ఫర్నిచర్ కూడా పాతదేనని వారు ఆరోపించారు. దీంతో పెళ్లికి వచ్చేందుకు నిరాకరించారు. నేను పెళ్లి విందును ఏర్పాటు చేసుకున్నాను. బంధు మిత్రులు అందరినీ పిలుచుకున్నాను. అయినా కానీ, వరుడు రాలేదు’’ అని వధువు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వరకట్న నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News