రష్యా-ఉక్రెయిన్.. ఏడాది యుద్ధంతో సాధించిందేమిటి?.. పుతిన్ నేడు కీలక ప్రకటన

  • 2022 ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం
  • ఇప్పటి వరకు 15వేల వరకు మరణాలు
  • ఉక్రెయిన్ ను వెనుక నుంచి నడిపిస్తున్న అమెరికా, నాటో
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ అసంపూర్ణంగా కొనసాగుతున్న ఈ యుద్ధంతో ఇరు దేశాలు సాధించింది ఏమీ లేదు. 7,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఇంతకు రెట్టింపు సంఖ్యలో సైనికులు మరణించి ఉంటారని అంచనా. యుద్ధం మొదలుపెట్టి ఏడాది కావస్తుండడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు.

2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దాడిని మొదలు పెట్టింది. అమెరికా అధ్వర్యంలోని నాటో దేశాలు ఉక్రెయిన్ భూభాగాన్ని తమ దేశానికి వ్యతిరేక కేంద్రంగా మలుచుకోకుండా చేయడమే తన ధ్యేయమని పుతిన్ నాడు ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యాన్ని నిర్వీర్యం చేయడమే తమ ఆపరేషన్ లక్ష్యమని తెలిపారు. కానీ, రష్యా అధ్యక్షుడి లక్ష్యాలు నెరవేరలేదు. సరికదా, అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున ఆయుధ, మందుగుండు, సైనిక సహకారాన్ని అందిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా త్వరగా ఉక్రెయిన్ ను నిర్వీర్యం చేయవచ్చని భావించిన రష్యాకు నిరాశే ఎదురైంది. 

పాశ్చాత్య దేశాలు అందించే అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉక్రెయిన్ రష్యాకు ఎదురు నిలిచి పోరాడుతోంది. దీంతో ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు సవాలుగా మారిపోయింది. ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. సైనిక చర్యల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. యూరప్ దేశాలకు చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. సహజ వాయువు వ్యాపారం కూడా దెబ్బతింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల కమిషన్ గణాంకాల ప్రకారం ఉక్రెయిన్ లో ఫిబ్రవరి 13 నాటికి 7,199 మంది మరణించారు. 11,800 మంది గాయపడ్డారు. 

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు సతమతం అవుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా అంతర్జాతీయంగా ఎన్నో దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇవి నిలిచిపోయాయి. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆహారం, చమురుపై యుద్ధం ప్రభావం చూపిస్తోంది. 

రష్యా అంటే పాశ్చాత్య దేశాలకు అంతగా సరిపడదు. దీంతో అవి రష్యాతో నేరుగా తలపడలేక, ఉక్రెయిన్ ను పావుగా వాడుకుంటున్నాయి. ఈ విషయంలో అమెరికా మరీ దారుణంగా ప్రవర్తిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో రూపాల్లో ఉక్రెయిన్ కు 50 బిలియన్ డాలర్ల నిధులను (రూ.4.10 లక్షల కోట్లు) అందించింది. అంతేకాదు, ఉక్రెయిన్ ఆకస్మిక పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో అర బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. అంటే సుమారు రూ.4,000 కోట్లు. ఏడాది కావస్తుండడంతో ఉక్రెయిన్ పై రష్యా తన యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News