ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్ లకు పూర్తిగా దూరమైన బుమ్రా

  • గాయాల బారినపడ్డ జస్ప్రీత్ బుమ్రా
  • బెంగళూరులోని ఎన్సీయేలో కోలుకుంటున్న వైనం
  • బుమ్రా ఫిట్ నెస్ పై ఇప్పటికీ క్లియరెన్స్ ఇవ్వని ఎన్సీయే
  • ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులు, వన్డే సిరీస్ కు బుమ్రాకు దక్కని చోటు
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయాలతో సతమతమవుతున్నాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న బుమ్రా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో కోలుకుంటున్నాడు. ఇప్పటికీ బుమ్రా ఫిట్ నెస్ పై ఎన్సీయే నుంచి స్పష్టత రాలేదు. 

తాజాగా ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియాను ప్రకటించగా అందులో బుమ్రా పేరు లేదు. ఆసీస్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులోనూ బుమ్రా లేడు. దాంతో, ఆ రెండు సిరీస్ లకు బుమ్రా పూర్తిగా దూరమైనట్టేనని తెలుస్తోంది. 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిశాక టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లు ఏమీ లేవు. మార్చి 31 నుంచి ఐపీఎల్ జరగనుండగా, భారత ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. బుమ్రా కూడా నేరుగా ఐపీఎల్ లో బరిలో దిగుతాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల బీసీసీ మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ టీమిండియా ఆటగాళ్ల ఫిట్ నెస్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. బుమ్రా తదితర కీలక ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుని బరిలో దిగుతారని చేతన్ శర్మ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే చేతన్ శర్మ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.


More Telugu News