థాంక్యూ ఇండియా.. టర్కీ అంబాసిడర్ ట్వీట్

  • భారతదేశం చేసిన సాయం ప్రశంసనీయమన్న టర్కీ అంబాసిడర్ 
  • విశాల హృదయమున్న భారతీయ ప్రజలూ సాయానికి ముందుకొచ్చారని వ్యాఖ్య
  • ఇండియా పంపిన సామగ్రికి సంబంధించిన వీడియో ట్వీట్
భూకంపంతో అతలాకుతలమైన టర్కీ (తుర్కియే)ని ఆదుకునేందుకు ముందుకొచ్చింది భారతదేశం. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సాయాన్ని పంపింది. సహాయక కార్యక్రమాల్లో ఎన్ డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ పాలుపంచుకున్నాయి. ఆపదలో తమకు అండగా నిలిచినందుకు తాజాగా టర్కీ కృతజ్ఞతలు తెలిపింది. 

భారతదేశం చేసిన విలువైన సహాయం నిజంగా ప్రశంసనీయమని ఇండియాలో టర్కీ అంబాసిడర్ ఫిరాత్ సునేల్ కొనియాడారు. ‘‘భారత ప్రభుత్వం మాదిరే.. విశాల హృదయం ఉన్న భారతీయ ప్రజలు కూడా భూకంప ప్రాంతంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి చేతులు కలిపారు. మీ విలువైన సహాయానికి మేము నిజంగా మీ అందరినీ అభినందిస్తున్నాము’’ అంటూ సునేల్ ట్వీట్‌ చేశారు. అలానే ఇండియా నుంచి టర్కీకి వచ్చిన టన్నుల కొద్దీ సమగ్రికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.

టర్కీ, సిరియాలో ఫిబ్రవరి 6న సంభవించిన పెను భూకంపం 44 వేల మందిని బలి తీసుకుంది. రెండు దేశాల్లో ఊళ్లకు ఊళ్లే నేలమట్టమయ్యాయి. చాలా చోట్ల సహాయక చర్యలను నిలిపేశారు.

భూకంపం సంభవించగానే.. తొలుత స్పందించిన దేశాల్లో ఇండియా ఒకటి. కేవలం ఆహారం, సరుకులు పంపడం మాత్రమే కాదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సాయానికి ఎన్ డీఆర్ఎఫ్ బృందాలను, ఆర్మీ సిబ్బందిని పంపింది. ఇండియన్ ఆర్మీ మహిళా జవానును ఓ టర్కీ మహిళ ప్రేమగా ముద్దాడుతున్న ఫొటో ఎన్నో మనసులను తాకింది.


More Telugu News