ర్యాగింగ్ భూతానికి నెల్లూరులో విద్యార్థి బలి

  • రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నఇంజనీరింగ్ స్టూడెంట్
  • కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • సీనియర్లు, రూంమేట్స్ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆవేదన
సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఓ జూనియర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. బాగా చదువుకుని తమ కుమారుడు ఉన్నత శిఖరాలకు చేరుతాడని తల్లిదండ్రులు కన్న కలలు కల్లలయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కావలి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిందీ దారుణం. జిల్లాలోని కడనూతల ఆర్ఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో జూనియర్లను సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేస్తున్నారు.

కాలేజీ హాస్టల్ లో జూనియర్లను వేధిస్తున్నారు. బీరు, బిర్యానీ తేవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. క్లాసులోని అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నారని జూనియర్ విద్యార్థి ప్రదీప్ తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీలో, హాస్టల్ లో జరుగుతున్న వేధింపులను ప్రదీప్ తమతో చెప్పుకుని బాధపడేవాడని తెలిపారు. మేం వచ్చి మాట్లాడతామని చెప్పినా వద్దనేవాడన్నారు.

తాము వస్తే వేధింపులు ఇంకా పెరుగుతాయని చెప్పాడన్నారు. టీసీ ఇచ్చేయండి.. వేరేచోట చదివించుకుంటామని అడిగినా యాజమాన్యం స్పందించలేదని ప్రదీప్ తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ కుమారుడు చనిపోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


More Telugu News