కన్నా ప్రకటించేశారు.. 23న టీడీపీలోకి.. అంతకుముందు భారీ ర్యాలీ!

  • గుంటూరులో అనుచరులతో నాలుగు గంటలపాటు సమావేశం
  • చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న అనుచరులు
  • తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు అధికారిక ప్రకటన
  • 23న మధ్యాహ్నం భారీ ర్యాలీగా చంద్రబాబు నివాసానికి
సస్పెన్స్ వీడింది. ఊహాగానాలకు తెరపడింది. బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తన అనుచరులతో నిన్న సమావేశమైన కన్నా.. అనంతరం టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించారు. 

అనుచరులతో దాదాపు 4 గంటలపాటు సమావేశమైన కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్ ప్రణాళిక, ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆయన సారథ్యంలోనే సాధ్యమవుతుందని ముక్తకంఠంతో వారంతా తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థుడు కావాలని, అందుకు చంద్రబాబే సరైన వ్యక్తి అని వారంతా అభిప్రాయపడ్డారు. 

ఈ నేపథ్యంలో వారి అభిప్రాయం మేరకు టీడీపీలో చేరాలని కన్నా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న మధ్యాహ్నం గుంటూరులోని కన్నావారి తోటలోని తన నివాసం నుంచి మద్దతుదారులతో కలిసి ర్యాలీగా బయల్దేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం చంద్రబాబు  సమక్షంలో టీడీపీలో చేరుతారు. ఆయనతోపాటు బీజేపీకి రాజీనామా చేసిన వారు కూడా అదే రోజు టీడీపీ కండువా కప్పుకుంటారు.


More Telugu News