సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

  • హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సాయన్న
  • కొంతకాలంగా అనారోగ్యం.. ఈనెల 16న ఆసుప్రతిలో చేరిక
  • టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం.. ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నిక
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. ఈనెల 16న ఆసుప్రతిలో జాయిన్ అయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు మరణించారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

1951 మార్చి 5న జన్మించిన జి.సాయన్న.. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీఎస్సీ), 1984లో ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 నుంచి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి గెలిచారు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


More Telugu News