శివసేన పేరు, గుర్తు కోసం 2 వేల కోట్ల డీల్.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

  • ఎన్నికల కమిషన్ నిర్ణయమే ఓ ఒప్పందమని సంజయ్ రౌత్ ఆరోపణలు
  • ఇది 100 శాతం నిజమని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ట్వీట్
  • అధికార పక్షంతో సంబంధాలున్న ఓ బిల్డర్ ఈ విషయం చెప్పారని వెల్లడి
శివసేన పేరు, గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై శివసేన (ఉద్ధవ్ థాక్రే) కీలక నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ కొనుగోలు కోసం 2 వేల కోట్ల డీల్ జరిగిందని ఈ రోజు ఆరోపించారు. 

‘‘రూ.2 వేల కోట్ల డీల్ అనేది ప్రాథమిక సంఖ్య. ఇది 100 శాతం నిజం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే వెల్లడిస్తా’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అధికార పక్షంతో సంబంధాలు ఉన్న ఓ బిల్డర్ తనతో ఈ విషయం చెప్పారని వెల్లడించారు. 

శివసేన పేరును కొనేందుకు రూ.2 వేల కోట్లతో డీల్ అనేది చిన్న విషయం కాదని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయమే ఓ ఒప్పందమని ఆరోపించారు. సంజయ్ ఆరోపణలపై షిండే వర్గం ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కొట్టిపారేశారు. ‘సంజయ్ రౌత్ క్యాషియరా?’ అని ప్రశ్నించారు.


More Telugu News