ఏప్రిల్ లో చార్ ధామ్ యాత్ర షురూ..

  • ఏప్రిల్ 22న తెరుచుకోనున్న గంగోత్రి, యమునోత్రి ఆలయాల గేట్లు
  • 25న కేదార్ నాథ్, 27న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్
  • జోషిమఠ్ లో భూమి కుంగుబాటు నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉత్తరాఖండ్  ప్రభుత్వం
  • ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం నాడు చార్ ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శీతాకాలం సందర్భంగా ఆరు నెలల పాటు మూసిన కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను త్వరలో తెరవనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22న చార్ ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 

అక్షయ తృతీయ నాడు యాత్ర ప్రారంభమవుతుందని, అదేరోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకుంటాయని వివరించింది. కేదార్ నాథ్ ఆలయ తలుపులు ఏప్రిల్ 25న ఉదయం 6:20 నిమిషాలకు తెరుచుకుంటాయని పేర్కొంది. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరవనున్నట్లు వెల్లడించింది.

చార్ ధామ్ యాత్ర జోషిమఠ్ గుండా సాగుతుంది. నాలుగు పుణ్య క్షేత్రాలలో ఒకటైన బద్రీనాథ్ కు జోషిమఠ్ కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇటీవల జోషిమఠ్ లో భూమి కుంగిపోయిన విషయం తెలిసిందే. అక్కడ పలు ఇండ్లకు పగుళ్లు రావడంతో అధికారులు పలు కుటుంబాలను వేరే చోటికి తరలించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ.. జోషిమఠ్ అంశం చార్ ధామ్ యాత్రపై ఎలాంటి ప్రభావం చూపించబోదని పేర్కొన్నారు.

యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం ధామి చెప్పారు. భక్తుల సెక్యూరిటీకి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గతేడాది జరిగిన యాత్రకు 45 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని భావిస్తున్నట్లు సీఎం ధామి చెప్పారు. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జోషిమఠ్ లో భూమి కుంగుబాటు నేపథ్యంలో యాత్రకు వచ్చే భక్తుల సెక్యూరిటీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు.


More Telugu News