తనను కాపాడిన వ్యక్తిని విడిచి వెళ్లనంటున్న పిల్లి.. వీడియో ఇదిగో!

  • టర్కీలో శిథిలాల కింద చిక్కుకున్న పిల్లి 
  • కష్టపడి బయటకు తెచ్చిన యువకుడు
  • యువకుడి వెన్నంటే ఉంటూ కృతజ్ఞత చాటుకుంటున్న పిల్లి
విశ్వాసానికి మారుపేరంటే అందరికీ శునకమే గుర్తొస్తుంది.. అయితే, టర్కీలో ఓ పిల్లి తనకూ విశ్వాసం ఉందని చేతల్లో చూపిస్తోంది. తనను కాపాడిన వ్యక్తిపై కృతజ్ఞత చాటుకుంటోంది. ఆయనను విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. దీంతో ఆ పిల్లికి రబుల్ అని పేరు పెట్టి తనే పెంచుకుంటున్నట్లు చెప్పాడా యువకుడు. అసలేం జరిగిందంటే..

ఈ నెల మొదట్లో టర్కీ (తుర్కియే) తో పాటు సిరియాలో సంభవించిన భూకంపం ఆ రెండు దేశాల్లో పెను విధ్వంసం సృష్టించింది. వేలాది బిల్డింగులు నేలకూలాయి. ఆ శిథిలాల కిందపడి ఇప్పటి వరకు 46 వేల మంది చనిపోయారు. అక్కడక్కడా కొంతమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. టర్కీ రెస్క్యూ టీమ్ కు చెందిన అలి కాకస్ అనే యువకుడు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం వెతుకుతుండగా కాకస్ కు ఓ పిల్లి కనిపించింది. ఇరుక్కుపోయిన స్థితిలో ఉన్న పిల్లిని కాకస్ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అంతే.. అప్పటి నుంచి ఆ పిల్లి కాకస్ ను వదలడంలేదు. తనతో పాటే తిరుగుతుండడంతో కాకస్ దానిని అడాప్ట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో సందడి చేస్తూ తిరుగుతున్న రబుల్ ను వీడియో తీసి కాకస్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.


More Telugu News