తారకరత్న మృతి పట్ల సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డి స్పందన
- గత నెలలో తారకరత్నకు గుండెపోటు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- తెలుగు రాష్ట్రాల్లో విషాదం
- తారకరత్న కుటుంబానికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
నందమూరి తారకరత్న మరణం శివరాత్రి నాడు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తారకరత్న మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా తారకరత్న మృతి పట్ల స్పందించారు. తారకరత్న మరణించారన్న వార్తతో తీవ్ర విచారం కలిగిందని వివరించారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు హార్దిక సంతాపం తెలియజేస్తున్నట్టు హరీశ్ వెల్లడించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
తారకరత్న మరణం బాధాకరం: కిషన్ రెడ్డి
తారకరత్న మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వెలిబుచ్చారు. తారకరత్న కన్నుమూయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
తారకరత్న అకాలమరణం తీవ్ర విచారం కలిగించింది: బండి సంజయ్
తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న అకాలమరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.