బీజేపీ ఎంపీ అర్వింద్ కు హైకోర్టులో ఊరట

  • కేసీఆర్ పై కార్టూన్ ను పోస్ట్ చేసిన కేసులో ఊరట
  • కేసీఆర్ చేతిలో మద్యం సీసా ఉన్నట్టుగా కార్టూన్
  • అర్వింద్ పై చర్యలు  తీసుకోవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిచేలా మార్ఫింగ్ చేసిన కార్టూన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ నమోదైన కేసులో బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2021 డిసెంబర్ 31న న్యూఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 వరకు, బార్లను 1 గంట వరకు అనుమతించారు. 

ఈ నేపథ్యంలో కేసీఆర్ చేతిలో మద్యం సీసా ఉన్నట్టుగా ఉన్న మార్ఫింగ్ కార్టూన్ ను అర్వింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ అర్వింద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం అర్వింద్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేసింది.


More Telugu News