మతంపై రాజమౌళి వ్యాఖ్యలకు మద్దతు పలికిన కంగనా రనౌత్

  • మతం ఒక దోపిడీలా అనిపించిందన్న రాజమౌళి
  • గతంలో తాను ఆధ్యాత్మిక యోగిలా జీవించానని వెల్లడి
  • రాజమౌళి వ్యాఖ్యలపై అతిగా స్పందించొద్దన్న కంగన
  • రాజమౌళి ఓ సినీ యోగి అని కితాబు
  • ఆయనను ఏమైనా అంటే సహించేది లేదని వార్నింగ్
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మతం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాను గతంలో గుళ్లూ, గోపురాలు తిరుగుతూ పూర్తి ఆధ్యాత్మిక జీవనం గడిపానని, ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించి చర్చికి కూడా వెళ్లానని వెల్లడించారు. అయితే తాను ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో మతం అనేది ఒక దోపిడీలా అనిపించిందని రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో, రాజమౌళి వ్యాఖ్యలను బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సమర్థించారు. రాజమౌళి వ్యాఖ్యలపై అతిగా స్పందించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. భక్తులం అయినంత మాత్రాన ప్రతి చోటికి దేవుడి జెండాను మోసుకుంటూ వెళ్లలేమని వ్యాఖ్యానించారు. మనం చేసే పనులే మాటల కంటే గట్టిగా వినిపిస్తాయని అభిప్రాయపడ్డారు. 

"ఓ హిందువునని చెప్పుకునేందుకు గర్విస్తాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది అన్ని రకాలుగా దాడులు చేసేవారికి, విద్వేషం వెదజల్లేవారికి, ట్రోలింగ్, తీవ్రస్థాయిలో ప్రతికూల భావాలు వ్యాపింపజేసేవారికి వర్తిస్తుంది. మేం అందరి కోసం సినిమాలు చేస్తాం. మా కళాకారులకు ఎన్నో రకాలు ప్రమాదాలు పొంచి ఉంటాయి. కానీ జాతీయవాదులుగా చెప్పుకునే వారి నుంచి మాకు ఎలాంటి మద్దతు లభించదు. దాంతో మాకు మేమే మద్దతు ఇచ్చుకుంటాం. అందుకే చెబుతున్నా... రాజమౌళి సర్ పై ఎలాంటి దాడినైనా సహించను. మౌనంగా ఉంటే మంచిది. నోరు పారేసుకోవద్దు. రాజమౌళి గారు జోరున కురిసే వర్షంలో భగభగమండే అగ్నికీల వంటివారు. ఆయనొక మేధావి... జాతీయవాది... అత్యున్నతస్థాయి సినీ యోగి. అలాంటి వ్యక్తి చిత్ర పరిశ్రమలో ఉండడం ఓ దీవెన వంటిది" అని కంగనా సోషల్ మీడియాలో వివరించారు.


More Telugu News