క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసు... అతడెవరో తనకు తెలియదన్న సప్నా గిల్

  • ముంబయిలో పృథ్వీ షాపై దాడి!
  • తమపై దాడి చేశారంటూ స్నేహితుడితో పోలీసులకు ఫిర్యాదు చేయించిన షా
  • సప్నా గిల్ అనే మహిళ, ఇతరులపై కేసు నమోదు
  • సప్నా గిల్ ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
ఇటీవల ముంబయిలో ఓ మహిళ, మరికొందరు తనపై దాడి చేశారంటూ టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తన స్నేహితుడితో పోలీసులకు ఫిర్యాదు చేయించడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్ సప్నా గిల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆమెకు న్యాయమూర్తి ఈ నెల 20 వరకు పోలీస్ కస్టడీ విధించారు. 

న్యాయమూర్తి ఎదుట సప్నా గిల్ మాట్లాడుతూ, పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని, అతడు క్రికెటర్ అని భావించలేదని వెల్లడించారు. పృథ్వీ షాను తన స్నేహితుడు సెల్ఫీ అడిగాడని, ఆ సమయంలో తాము ఇద్దరమే ఉన్నామని, పృథ్వీ షాతో ఎనిమిది మంది ఉన్నారని ఆమె వివరించారు. ఆ సమయంలో పృథ్వీ షా మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. 

ఆమె తరఫు న్యాయవాది కూడా పలు ఆసక్తికర అంశాలను కోర్టులో లేవనెత్తారు. మద్యం తాగుతాడన్న కారణంతో పృథ్వీ షాను క్రికెట్ బోర్డు గతంలో నిషేధించిందని వెల్లడించారు. ఘటన జరిగిన 15 గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. 

అంతేకాకుండా, రూ.50 వేలు ఇవ్వాలంటూ తన క్లయింటు సప్నా గిల్ బెదిరించినట్టు పృథ్వీ షా బృందం చేసిన ఆరోపణల్లో నిజంలేదని న్యాయవాది స్పష్టం చేశారు.


More Telugu News