ఎయిర్ ఇండియాపై ప్రధాని మోదీ సలహాదారు తీవ్ర అసంతృప్తి.. విసిగిపోయానని వ్యాఖ్య

  • ఎయిర్ ఇండియాపై పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ తీవ్ర అసంతృప్తి
  • విమానం ఆలస్యం అవడంపై ట్విట్టర్‌లో ఫిర్యాదు
  • ప్రైవేటీకరణకు ముందే ఎయిర్ ఇండియా మెరుగ్గా ఉండేదంటూ వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీకి అనుబంధంగా ఉండే ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దెబ్రాయ్.. ఎయిర్ ఇండియా సేవలపై తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ జరగక మునుపే ఎయిర్ ఇండియా మెరుగ్గా ఉండేదని వ్యాఖ్యానించారు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంతో ఆయన ట్విట్టర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. 

‘‘ఎయిర్ ఇండియాతో విసిగిపోయా.. ఢిల్లీ వెళ్లేందుకు ఓ టిక్కెట్ బుక్ చేశా. విమానం సాయంత్రం 4.35కు బయలుదేరాల్సి ఉంది. ఇప్పుడు రాత్రి ఏడు కావస్తోంది. కానీ.. విమానం ఎప్పుడు బయలుదేరుతుందో ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు. ప్రైవేటీకరణకు మునుపే ఎయిర్ ఇండియా మెరుగ్గా ఉండేది’’ అని ఆయన ట్వీట్ చేశారు. వీలైతే ఇకపై ఎయిర్ ఇండియా ఎక్కకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. 

కాగా.. బిబేక్ దెబ్రాయ్ ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా స్పందించింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానం ఆలస్యం అయిందని చెప్పింది. ఎనిమిది గంటలకు విమానం బయలు దేరుతుందని ఆయనకు ట్విట్టర్‌లో బదులిచ్చింది. 

గతేడాది జనవరిలో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు మెరుగుపరిచే దిశగా ఇటీవలే ఎయిర్ ఇండియా 470 కొత్త విమానాలకూ ఆర్డరిచ్చింది.


More Telugu News