ఏడాది తర్వాత తెరుచుకున్న శివాలయం.. ఎప్పుడు నిర్మించారో తెలుసా?

  • మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సెన్ జిల్లాలో ఆలయం
  • వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శివాలయం
  • 1974లో తెరుచుకున్నఆలయం
  • అప్పటి నుంచి ఏడాదికోసారి మాత్రమే శివయ్య దర్శనం
  • భక్తుల కోసం 5 క్వింటాళ్ల కిచిడీ,  పండ్లను సిద్ధం చేసిన అధికారులు
మహాశివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సెన్ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయం ఈ ఉదయం తెరుచుకుంది. ఇందులో విచిత్రం.. వింత ఏముందనేగా మీ అనుమానం. ఉంది! ఈ ఆలయం ఏడాదికి ఒకసారి.. అది కూడా మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుచుకుంటుంది. రాజధాని భోపాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శివాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయం పలువురు ముస్లిం రాజుల అధీనంలోకి వెళ్లింది. 

సామాన్య ప్రజల కోసం ఆలయాన్ని తెరవాలంటూ 1974లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సేథీ ఆలయాన్ని తెరిచారు. అయితే, ఒక్క శివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతినిచ్చారు.  ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది. పూజల నిమిత్తం ఈ ఉదయం ఆలయాన్ని తెరిచారు. 

12 గంటలపాటు శివుడికి పూజాదికాలు జరుగుతాయి. అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే తెరుచుకునే ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 5 క్వింటాళ్ల కిచిడీ, పండ్లను సిద్ధం చేస్తున్నారు.


More Telugu News