కాంటాక్టు లెన్సులు తీయకుండా నిద్రపోతే ఏం జరిగిందో చూడండి!

  • ఇటీవల బాగా పెరిగిన కాంటాక్టు లెన్సుల వాడకం
  • లెన్సుల తీయకపోవడంతో కంటిలో ఇన్ఫెక్షన్
  • కంటిని తినేసిన పరాన్నజీవులు
  • కంటి చూపు కోల్పోయిన అమెరికా యువకుడు
కళ్లద్దాలకు బదులుగా మెరుగైన కంటిచూపు కోసం కళ్లలోనే అమర్చుకునే కాంటాక్టు లెన్సుల వాడకం ఇటీవల బాగా పెరిగింది. అయితే, విశ్రమించే సమయంలో కాంటాక్టు లెన్సులు తీసేయాలని నిపుణులు చెబుతుంటారు. 

అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన మైక్ క్రుమోల్జ్ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా కాంటాక్టు లెన్సులు వాడుతున్నాడు. కాంటాక్టు లెన్సులు తీసేయకుండా మర్చిపోయిన రోజున అతడికి కళ్లు ఎర్రబారడం, మంటలు వంటి కంటి ఇన్ఫెక్షన్లు కొత్త కాదు. అయితే ఎప్పట్లాగానే ఒకరోజున కాంటాక్ట్ లెన్సులు తీయకుండానే నిద్రపోయాడు. మరుసటి రోజు కుడికంటిలో తీవ్ర అసౌకర్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లాడు. అప్పటికే ఆ కన్ను చూపు కోల్పోయింది. 

ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం, మాంసాహారం తినే పరాన్నజీవులు అతడి కంటిని తినేశాయని డాక్టర్లు వెల్లడించారు. దీని వైద్య పరిభాషలో అకాంతోమీబా కెరాటైటిస్ అని పిలుస్తారు. 

మైక్ క్రుమోల్జ్ వయసు 21 సంవత్సరాలు. ఒక రోజు ఉదయం లేవగానే కంటిలో తీవ్ర అసౌకర్యంగా ఉండడంతో ఐదుగురు కంటి వైద్యులను, ఇద్దరు కార్నియా స్పెషలిస్టులను కలిశానని క్రుమోల్జ్ వెల్లడించాడు. చివరికి ఎంతో అరుదైన ఇన్ఫెక్షన్ సోకినట్టు డాక్టర్లు నిర్ధారించారని తెలిపాడు. పీడీటీ సర్జరీ కూడా చేశారని, ఇదొక బాధాకరమైన ప్రక్రియ అని, తన కుడికన్ను ఏమాత్రం పనిచేయడంలేదని వాపోయాడు. 

ఈ నేపథ్యంలో, తన చికిత్స కోసం గో ఫండ్ మీ పేజ్ ద్వారా సాయం కోరుతున్నాడు. అంతేకాదు, కాంటాక్టు లెన్సులపై అవగాహన కలిగిస్తూ ప్రచారం చేస్తున్నాడు. కాంటాక్టు లెన్సుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అందుకు తానే ఉదాహరణ అని క్రుమోల్జ్ చెబుతున్నాడు.


More Telugu News