నాపై అలాంటి కామెంట్స్ రావడానికి కారణమదే: ఎస్వీ కృష్ణారెడ్డి

  • హీరో కావాలనే మద్రాసు వెళ్లానన్న ఎస్వీ కృష్ణారెడ్డి
  • డబ్బు కోసం స్వీట్ షాపు నడిపామని వెల్లడి 
  • తాను కాజాలు .. లడ్డూలు చేసేవాడినంటూ వివరణ 
  • సినిమా పిచ్చి ఏ పనైనా చేయించేస్తుందని వ్యాఖ్య  
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన నుంచి సినిమాలు రాక చాలా కాలమే అయినా ఆయన చిత్రాలను ప్రేక్షకులు మరచిపోలేదు. కథ .. స్క్రీన్ ప్లే .. మాటల విషయంలోనే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా ఆయన మంచి మార్కులు కొట్టేయడం విశేషం. అప్పట్లో ఆయన సినిమాల్లోని పాటలన్నీ హిట్టే. 

అలాంటి ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను హీరోను కావాలనే ఉద్దేశంతోనే మద్రాస్ కి వెళ్లాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని నాకు అర్థమైంది. సినిమా చేయడానికి అవసరమైన డబ్బు కోసం నేను .. అచ్చిరెడ్డి స్వీట్ షాప్ నడిపాము. నేను కాజాలు .. లడ్డూలు బాగా చేసేవాడిని. అలా మా తొలి ప్రయత్నంగా 'కొబ్బరిబొండం' రావడం .. హిట్ కావడం జరిగిపోయాయి" అని అన్నారు. 

"ఎస్వీ కృష్ణారెడ్డికి డైరెక్షన్ రాదు .. సంగీతం రాదు .. ఘోస్ట్ లను పెట్టుకుని కానిచ్చేస్తుంటాడు అనే కామెంట్లు వచ్చాయి. నేను ఎవరి దగ్గరా డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేయలేదు. నాటకాలు రాయలేదు .. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. అందువలన అలా అనుకోవడం సహజం. సినిమా అంటే ఉండే పిచ్చి ఏ పనైనా చేయించేస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.  



More Telugu News