ఢిల్లీ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 263 ఆలౌట్

  • భారత్, ఆసీస్ మధ్య రెండో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 4 వికెట్లు తీసిన షమీ... మూడేసి వికెట్లు పడగొట్టిన అశ్విన్, జడేజా
  • తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్
  • ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 రన్స్
ఢిల్లీ టెస్టులో తొలిరోజు ఆట భారత్ కు అనుకూలంగానే సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ షమీ 4, రవిచంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 3 వికెట్లతో రాణించారు. 

ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పీటర్ హ్యాండ్స్ కోంబ్ 72 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. ఓ దశలో ఆసీస్ 168 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా... హ్యాండ్స్ కోంబ్, కెప్టెన్ పాట్ కమిన్స్ జోడీ జట్టు స్కోరును 200 దాటించింది. కమిన్స్ 33 పరుగులు చేశాడు. చివర్లో షమీ విజృంభించి టెయిలెండర్ల పనిబట్టడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది 

ఇక, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.


More Telugu News