బిలియనీర్ జార్జ్ సోరోస్ వ్యాఖ్యలు భారత్ పై దాడే: మండిపడ్డ స్మృతి ఇరానీ
- సోరోస్ వ్యాఖ్యలు భారత ప్రజాస్యామాన్ని దెబ్బతీసే కుట్రగా అభివర్ణణ
- అతడికి గట్టిగా బదులివ్వాలంటూ దేశ ప్రజలకు పిలుపు
- అదానీ కుదుపులు భారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నాంది అన్న సోరోస్
బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీనిపై ఘాటుగా స్పందించారు. సోరోస్ వ్యాఖ్యలను భారత్ పై దాడిగా అభివర్ణించారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఇటీవల స్టాక్ మార్కెట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. బారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయంటూ సోరోస్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకోకుండా భారతీయులు అందరూ దీనిపై గట్టిగా స్పందించాలని స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు.
‘భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలను దెబ్బతీసే ప్రకటన’గా దీన్ని స్మృతి ఇరానీ అభివర్ణించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన సదరు విదేశీ శక్తులను ఓడించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయంటూ.. మరోసారి కూడా అదే జరుగుతుందన్నారు. జార్జ్ సోరోస్ కు తగిన సమాధానం చెప్పాలని ప్రతీ భారతీయుడిని కోరుతున్నానని ఆమె అన్నారు.
భారతదేశం పట్ల దురుద్దేశాలు ప్రదర్శించిన జార్జ్ సోరోస్ డిజైన్ చేయబడిన ఆర్థిక యుద్ధ నేరగాడిగా ఇరానీ వ్యాఖ్యానించారు. ‘‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను బద్దలు కొట్టి, ఆర్థిక యుద్ధ నేరస్థుడిగా పేర్కొనబడిన వ్యక్తి.. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే కోరికను ప్రకటించాడు’’ అని ఆమె ఆరోపించారు. అలాంటి శక్తులు విదేశాల్లోని ప్రభుత్వాలను పడగొట్టి, వారు ఎంచుకున్న వ్యక్తులను అధికారంలో కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తాయని ఆమె అన్నారు.