ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు.. జీవీఎల్ వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్

  • ‘అన్నీ ఇద్దరి పేర్లేనా’ అంటూ ఎన్టీఆర్, వైఎస్సాఆర్ లను ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి
  • ఇద్దరు నేతల గురించి వివరిస్తూ ట్వీట్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఉద్దేశించి బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 

‘అన్నీ ఇద్దరి పేర్లేనా’ అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పురందేశ్వరి.. ‘‘ఒకరు తెలుగు జాతికి గుర్తింపు తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం అందించారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారు. మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు’’ అని మరో ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో చాలా కాలంగా అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో రాజకీయాలు.. కేవలం రెండు పార్టీలకో, కుటుంబాలకో పరిమితం కాదు. ఏది చూసినా ఆ కుటుంబం.. లేదా ఈ కుటుంబం. ఆ పార్టీ.. ఈ పార్టీ. అన్నీ ఇద్దరి పేర్లేనా? మిగతా నాయకులెవరూ కనిపించరా?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు ట్విట్టర్ లో పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.


More Telugu News