పృథ్వీ షానే తనపై దాడి చేశాడంటున్న నిందితురాలు

  • ముంబైలో సెల్ఫీ విషయంలో షాతో పలువురి గొడవ
  • పృథ్వీ ప్రయాణిస్తున్న కారును వెంబడించి ధ్వంసం చేసిన వైనం
  • ఈ కేసులో మోడల్ సప్నా గిల్ సహా 8 మంది అరెస్ట్
సెల్ఫీ వివాదంలో ముంబైలో టీమిండియా పృథ్వీ షాపై దాడి విషయంలో కొత్త కోణం వెల్లడైంది. పృథ్వీ షా, అతని స్నేహితులు తనపై శారీరకంగా దాడి చేశారని ఈ కేసులో అరెస్టయిన సనా అలియాస్ సప్నా గిల్ అనే మోడల్ ఆరోపించింది. ముంబైలోని ఓషివారా పోలీసులు బుక్ చేసిన 8 మందిలో సప్నా గిల్ ఒకరు.  పృథ్వీ షా అతని స్నేహితులు మహిళపై దాడి చేశారని, అప్పుడు షా చేతిలో కర్ర ఉందని ఆరోపించింది.

కాగా, ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఉన్న సప్నా గిల్ ను పోలీసులు వైద్య పరీక్షలకు అనుమతించడం లేదని ఆమె లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ తెలిపారు. ‘సప్నాపై పృథ్వీ దాడి చేశాడు. పృథ్వీ చేతిలో కర్ర కనిపించింది. పృథ్వీ స్నేహితులే ముందుగా సప్నా గ్రూప్ పై దాడి చేశారు. ప్రస్తుతం సప్నా ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఉంది. వైద్యం చేయించుకునేందుకు పోలీసులు ఆమెను అనుమతించడం లేదు’ అని అలీ కాషిఫ్ చెప్పారు.

 కాగా, ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వెలుపల పృథ్వీ షా, అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్ కారుపై దాడి చేసినందుకు సప్నా గిల్‌ సహా 8 మందిపై ఓషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. సప్నా గిల్ , ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్ తన స్నేహితుడితో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు సెల్ఫీల కోసం పృథ్వీ షా వద్దకు వెళ్లిన తర్వాత ఈ గొడవ జరిగింది. 

తొలుత సెల్ఫీలు ఇచ్చిన షా, సప్నా గిల్ మరిన్ని ఫొటోలు తీసుకుంటానని చెప్పడంతో తిరస్కరించాడు. తాను స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి వచ్చానని, డిస్టర్బ్ చేయకూడదని చెప్పాడు. అయినా కొంతమంది వ్యక్తులు సెల్ఫీల కోసం పట్టుబట్టడంతో పృథ్వీ స్నేహితుడు సహాయం కోసం హోటల్ మేనేజర్‌ను పిలవాల్సి వచ్చింది. మేనేజర్ నిందితులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పృథ్వీ, అతని స్నేహితుడు డిన్నర్‌ ముగించుకుని హోటల్‌ నుంచి బయటకు వచ్చేసరికి నిందితులు బేస్‌బాల్‌ బ్యాట్లతో నిలబడి ఉండడం చూశారు. వారిని వెంబడించి పృథ్వీ స్నేహితుడి కారు ముందు, వెనుక అద్దాలను పగులగొట్టినట్టు కేసు నమోదైంది.


More Telugu News