స్కూటీ ధర రూ. లక్ష.. ప్యాన్సీ నంబరుకు కోటికిపైనే ఖర్చుకు రెడీ!

  • HP999999ను వేలానికి పెట్టిన హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ
  • కనీస ధర రూ. 1000గా నిర్ణయం
  • రూ.1,00,11,000తో బిడ్ దాఖలు చేసిన వ్యక్తి 
  • నంబరు కోసం 26 మంది పోటీ
చాలామందికి ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఉంటుంది. అది మొబైల్ నంబరైనా.. వాహన నంబరు అయినా. దానిని దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. వాహన విలువతో సంబంధం లేకుండా లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు ముందుకొస్తారు. ఫ్యాన్సీ నంబర్లను క్యాష్ చేసుకునేందుకు రవాణా శాఖ వాటిని వేలం వేస్తూ ఉంటుంది. కావాలనుకున్న వారు పోటీలుపడీ కొనుగోలు చేస్తుంటారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రవాణా శాఖ HP999999ను వేలానికి ఉంచింది. దీని కనీస ధరను రూ. 1000గా నిర్ణయించింది. 

ఈ నంబరును దక్కించుకునేందుకు ఔత్సాహిక వాహనదారుల మధ్య పోటీ మొదలైంది. మొత్తం 26 మంది బిడ్డింగులో పాల్గొన్నారు. అందులో ఓ వ్యక్తి  అక్షరాలా కోటీ పదకొండు వేల (రూ.1,00,11,000) రూపాయలకు బిడ్ దాఖలు చేశాడు. ఇంతా చేస్తే ఆ వ్యక్తి వద్ద ఉన్నది బెంజ్, ఆడి లాంటి ఖరీదైన కారు కాదు.. ఓ స్కూటీ! 

సిమ్లా కోట్‌ఖాయ్‌కు చెందిన ఆ వ్యక్తి ఇటీవలే దాదాపు లక్ష రూపాయలతో స్కూటీ కొనుగోలు చేశాడు. ఇప్పుడు దానికి నంబరు కోసం ఏకంగా కోటికిపైనే ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాడు. అతడి బిడ్డింగును చూసి అధికారులు కూడా షాకయ్యారు. నేటి సాయంత్రం వరకు బిడ్డింగులు స్వీకరిస్తారు. అనంతరం అధికమొత్తం కోట్ చేసిన వారికి ఆ నంబరును కేటాయిస్తారు. చూడాలి మరి! ఈ ఫ్యాన్సీ నంబరు ఎవరి సొంతమవుతుందో.


More Telugu News