నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈనాటి హైలైట్స్

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నేడు 21వ రోజు.. సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర
  • వివిధ వర్గాలతో భేటీ .. పోలీసులను మరోసారి హెచ్చరించిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. లోకేశ్ 21వ రోజు పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం రాయపేడు నుంచి నేడు ప్రారంభమైంది. కాగా, లోకేశ్ పాదయాత్ర దారిలో తిమ్మ సముద్రం, రాగి కుంట, కొత్తూరు, పీవీ కండ్రిగ గ్రామాల్లో ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లను పోలీసులు తొలగించారు. 

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుంది!

21వ రోజు యువగళం పాదయాత్రకు బయలుదేరేముందు సత్యవేడు నియోజకవర్గం రాయపేడులో యువతీయువకులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో యువత భవిష్యత్ కోసమే తాను సుదీర్ఘ యువగళం పాదయాత్ర ప్రారంభించానని చెప్పారు. 

"టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రకాలుగా యువతను ఆదుకున్నాం. ప్రైవేట్, ప్రభుత్వ, స్వయం ఉపాధి రంగాల ద్వారా యువతను ఆదుకున్నాం. రాయలసీమకు పరిశ్రమలు తెచ్చిన ఘనత చంద్రబాబుది. ప్రైవేటు రంగంలో 6 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ రంగంలో 32 వేల పోస్టులు భర్తీ చేశాం" అని వెల్లడించారు.

కానీ ఇప్పుడు ఓనర్లు లారీలు అమ్ముకుని డ్రైవర్లు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "ఐదు రకాలుగా యువతను జగన్ మోసం చేశాడు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ, జాబ్ కేలండర్, పోలీసు ఉద్యోగాల భర్తీ, యేటా డీఎస్సీ అన్నాడు. ఉద్యోగాలు ఇచ్చింది సున్నా. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. 31 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు. ఏనాడైనా హోదా గురించి, యువత గురించి మాట్లాడారా? పరిశ్రమల గురించి మంత్రిని అడిగితే కోడి గుడ్డు పెట్టింది... దాన్ని నేను కాపలాకాస్తున్నా... అది పొదగాలి అని అంటున్నారు" అని ఎద్దేవా చేశారు. 

ఏపీ రాజధాని ఏదో వైసీపీ నేతలకైనా తెలుసా? 

మన రాజధాని పేరేంటో ఎవరికైనా తెలుసా? వైసీపీ నేతలను కూడా అడుగుతున్నా... ఏపీ రాజధాని ఏది? ఈ 420 సీఎం రాయలసీమకు వస్తే కర్నూలు, ఉత్తరాంధ్ర వెళితే విశాఖ, ఆంధ్రాకు వెళితే అమరావతి రాజధాని అని అంటున్నాడు. ఐటీలో దేశంలో మన ఏపీ వెనకబడింది. జగన్ ఏ పరిశ్రమదారుడ్నీ కలవరు. ఐటీ మంత్రికి ల్యాప్ టాప్ ఓపెన్ చేయడం కూడా తెలియదు. 

ప్రత్యేక హోదాపై వైసీపీని నిలదీయండి!

ప్రత్యేక హోదాను చంద్రబాబు ఇప్పటికీ అడుగుతునే ఉన్నారు. మా ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతున్నారు. 31 మంది ఎంపీలున్నా వైసీపీ స్పందించడం లేదు... పోరాడడం లేదు. హోదా కోసం జగన్ రెడ్డి దీక్ష పెట్టి... కాలేజీల్లో యువభేరీలు పెట్టాడు. ఒక్క అవకాశం ఇవ్వండి, హోదా తెస్తానన్నాడు... కానీ మాట్లాడుతున్నాడా? రాష్ట్రానికి ప్రత్యేకహోదాకు టీడీపీ కట్టుబడి ఉంది. 

మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి!

సత్యవేడు నియోజకవర్గం రాజుల కండ్రిగలో హార్టీకల్చర్ రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాలనపై పోరాడకుంటే మోటార్లకు మీటర్లు శాశ్వత ఉరితాళ్లుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల్లో చైతన్యం రావాలి. కేసులు పెడతామంటే ఎవరూ భయపడొద్దు... నాపైనా జగన్ రెడ్డి 20 కేసులు పెట్టాడు. నా మైకు, వాహనాలు లాక్కున్నాడు. చివరకు స్టూల్ కూడా లాక్కుంటున్నారు. నేను పడుకునే బస్సు లాక్కుపోయినా.... నా అక్క చెల్లెమ్మలు నాకో చాప, దుప్పటి ఇస్తారు. నడిరోడ్డుపైనే పడుకుంటా... ప్రజల మధ్యే ఉంటాను.

రాయలసీమ ద్రోహి జగన్!

జగన్ రెడ్డి రాయలసీమలో పుట్టాడా? మరెక్కడైనా పుట్టాడా? రాయలసీమ ప్రజలకు అన్ని రకాలుగా జగన్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కరెంటు బిల్లు ఒక్కరోజు లేటుగా కడితే కనెక్షన్ కట్ చేసేస్తారు. వ్యవసాయరంగం పైనే కాదు ఏ రంగంపైనా జగన్ రెడ్డికి అనుభవం లేదు. కేవలం ఆయనకు దోచుకోవడం పైనే అవగాహన ఉంది. రైతుల సంక్షేమంపై మా విధివిధానాలు త్వరలోనే మ్యానిఫెస్టో రూపంలో వెల్లడిస్తాం. 

నన్ను ఇబ్బందిపెడితే అది మీకే నష్టం... పోలీసులకు లోకేశ్ హెచ్చరిక

లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కేవీబీ పురంలో ప్రజ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. "నా సౌండ్ వెహిక‌ల్ ప‌ట్టుకెళ్లారు, మైకు లాక్కున్నారు, స్టూలు కూడా లాగేస్తున్నారు. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు అనేక సమస్యలు చెబుతున్నారు. ప్రజ‌ల త‌రఫున నేను పోరాడుతున్నాను. తాడేప‌ల్లి సైకో ఆదేశాల‌తో పోలీసులు న‌న్ను అడుగ‌డుగునా ఇబ్బంది పెడుతున్నారు. న‌న్ను ఇబ్బంది పెడితే రేపు ఇబ్బంది ప‌డేది మీరే. మీరు న‌మ్ముకున్న జ‌గ‌న్‌, మీతో ఈ అరాచ‌కాల‌న్నీ చేయిస్తున్న ఐపీఎస్ ర‌ఘురామిరెడ్డి మీకు ఏమీ చేయ‌డు. 21 రోజుల యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ ట్రైల‌ర్‌కే భ‌య‌ప‌డుతున్నాడు... ఇంకా 379 రోజుల దండ‌యాత్ర ముందుంది జగన్. రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తున్న‌ రిషాంత్ రెడ్డి ఐపీఎస్ ఎలా అయ్యాడో డౌట్‌. 

లోకేశ్ ను కలిసిన పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధులు

సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధులు యువనేతను కలిశారు. ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ... స్థానిక సంస్థలకు తెలియకుండా వారి నిధులను కొట్టేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. 

"టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు అందజేసి గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తాం" అని హామీ ఇచ్చారు.

లోకేశ్ ను కలిసిన గోపాలమిత్రలు

పాదయాత్ర సందర్భంగా సత్యవేడు మండల గోపాలమిత్రలు లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కరికీ ఉద్యోగభద్రత లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోపాలమిత్రలను పునరుద్ధరిస్తామని, గోపాలమిత్రల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

*టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన దూరం - 278.5 కి.మీ.*

*21వ రోజు (16-2-2023) నడిచిన దూరం 17.2 కి.మీ.*

========

*22వ రోజు (17-2-2023) యువగళం పాదయాత్ర పర్యటన షెడ్యూలు*

ఉదయం

8.00 - బైరాజు కండ్రిగ విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం

8.35 - పార్టీ సీనియర్లతో ఆశీర్వచనం.

10.00 - కొత్తకండ్రిగ వద్ద రైతులతో సమావేశం

10.40- శివనాథపురం వద్ద పార్టీ నేతలతో సమావేశం

11.05 - రాజీవ్ నగర్ పంచాయతీ టిడ్కో హౌసెస్ వద్ద నిరుద్యోగులు-టిడ్కో బాధితులతో సమావేశం.

11.30 - పీవీఆర్ గార్డెన్స్ వద్ద బహిరంగ సభ.

12.30 - వీఆర్ గార్డెన్స్ వద్ద భోజన విరామం.

సాయంత్రం

3.15 - బంగారమ్మ గుడి చెక్ పోస్టు వద్ద స్థానికులతో మాటామంతీ

3.40 - శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులతో సమావేశం

4.00 - శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంసీ సర్కిల్-శివ సర్కిల్ వద్ద మైనారిటీలతో సమావేశం.

4.20 - ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పట్టణ వాసులతో మాటామంతీ.

5.10 - బీపీ అగ్రహారం వద్ద పట్టణ వాసులతో మాటామంతీ.

5.30 - ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ (పొన్నాలమ్మ దేవాలయం) విడిది వద్ద బస.


More Telugu News