సెల్ఫీ ఇవ్వలేదని టీమిండియా క్రికెటర్ పై దాడి చేసిన మహిళ

  • మిత్రుడితో కలిసి హోటల్ కు వెళ్లిన పృథ్వీ షా
  • సెల్ఫీ అడిగిన వ్యక్తులు
  • ఇద్దరికి మాత్రమే సెల్ఫీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిన షా
  • పృథ్వీ షా ఎక్కిన కారుపై బేస్ బాల్ బ్యాట్లతో దాడి
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా ముంబయిలో తన స్నేహితుడితో కలిసి స్టార్ హోటల్ కు వెళ్లగా, అక్కడ సెల్ఫీ ఇవ్వలేదంటూ కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన నేడు వెలుగులోకి వచ్చింది. వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. 

నిన్న పృథ్వీ షా తన స్నేహితుడు ఆషిక్ సురేంద్రతో కలిసి శాంతాక్రజ్ లోని ఓ స్టార్ హోటల్ కు వెళ్లాడు. కొందరు వ్యక్తులు సెల్ఫీ కావాలంటూ పృథ్వీ షాని కోరారు. వారిలో ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా సమ్మతించాడు. అయితే ఆ బృందంలోని మిగతా వారు కూడా వచ్చి సెల్ఫీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. తాను మిత్రుడితో డిన్నర్ కు వచ్చానని, అందరికీ సెల్ఫీలు ఇచ్చేందుకు ఇది సమయం కాదని పృథ్వీ షా తెలిపాడు. 

అయిన్పటికీ వారు ఒత్తిడి చేయడంతో, పృథ్వీ షా స్నేహితుడు ఆషిక్ సురేంద్ర హోటల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన మేనేజర్ అక్కడికి చేరుకుని ఆ వ్యక్తులను పంపించివేశాడు. 

కాగా, భోజనం ముగించుకున్న పృథ్వీ షా, అతడి స్నేహితుడు హోటల్ బయటికి రాగానే... సెల్ఫీలు అడిగిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వీ షా ఎక్కిన బీఎండబ్ల్యూ కారుపై బేస్ బాల్ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి చేసిన వారిలో ఓ మహిళ కూడా ఉండగా, ఆమెను నిలువరించేందుకు పృథ్వీ షా ప్రయత్నించాడు. 

ఈ నేపథ్యంలో, గొడవ మరింత పెద్దది కాకుండా స్నేహితుడు ఆషిక్ సురేంద్ర... పృథ్వీ షాను మరో కారులో అక్కడి నుంచి పంపించివేశాడు. సురేంద్ర మరో కారులో వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, ఓ పెట్రోల్ పంప్ వద్ద సదరు బృందంలోని ఓ మహిళ అతడి కారును అడ్డగించింది. రూ.50 వేలు ఇవ్వకపోతే తప్పుడు కేసు పెడతామని బెదిరించింది. 

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎనిమిది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సప్నా గిల్ (సనా), శోభిత్ ఠాకూర్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News