మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

  • కిన్నెరమెట్ల మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్ లో ఇంటి స్థలం కేటాయించడంపై విమర్శ
  • బంజారా హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ లో స్థలం ఇవ్వాలని డిమాండ్
  • ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మొగిలయ్య
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శలు గుప్పించారు. కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ మొగిలయ్యకు హైదరాబాద్ శివారులోని బీఎన్ రెడ్డి నగర్ లో ఇంటి స్థలం కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. క్రీడాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలం ఇచ్చి, మొగిలయ్యకు నగర శివారులో స్థలం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కళాకారులకు కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. 

శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల నగదును ప్రకటించింది. దీంతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది. మొగిలయ్యకు రూ. కోటి నగదు, ఆయన కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.


More Telugu News